calender_icon.png 27 November, 2024 | 10:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టార్గెట్ కమర్షియల్ ట్యాక్స్

27-08-2024 01:24:11 AM

ఏసీబీకి చిక్కుతున్న అధికారులు

25రోజుల్లో ఇద్దరు డీసీటీఓల పట్టివేత

తృటిలో తప్పించుకున్న మరో అధికారి!

దాడలు జరుగుతున్నా ఆగని లంచాలు

ఉన్నతాధికారుల అండదండలతోనే వసూళ్లు

* జూలై 31న పంజాగుట్ట సర్కిల్ -1 పరిధిలో డీసీటీఓగా విధులు నిర్వహిస్తున్న శ్రీధర్ రెడ్డి రూ.2లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు.

* ఆగస్టు 23వ తేదీన హైదరాబాద్‌లోని నారాయణగూడలో సర్కిల్ పరిధిలోని వాణిజ్య పన్నుల శాఖలో డీసీటీఓగా పని చేస్తున్న వసంత రూ.35వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. 

* వారం రోజుల క్రితం నారాయణగూడ పరిధిలోనే  ఓ అధికారి లంచం డిమాండ్ చేయగా బాధితులు ఏసీబీని ఆశ్రయించినట్లు తెలిసింది. దీంతో ఏసీబీ అధికారులు ఆ లంచగొండి అధికారిని పట్టుకునే ప్రయత్నం చేయగా అతనికి ముందే ఈ విషయం తెలిసి పరారైనట్లు సమాచారం. ఆ తర్వాత నుంచి అతను సెలవులో ఉన్నట్లు సమాచారం.

హైదరాబాద్, ఆగస్టు 2౬ (విజయక్రాం తి): వాణిజ్య పన్నుల శాఖలో అవినీతి అధికారుల వసూళ్ల పర్వానికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. దీంతో కొంతకాలంగా కమర్షియల్ ట్యాక్స్ అధికారులే లక్ష్యంగా ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఒకవైపు ఏసీబీకి చిక్కుతున్నా అధికారులు ఏమాత్రం భయపడకుండా లంచాలను డిమాండ్ చేస్తున్నారు. కేవలం నెలరోజుల్లోనే ఈ మూడు ఉదంతాలు జరిగాయంటే వాణి జ్య పన్నుల శాఖలో అక్రమార్కులు ఏ స్థాయిలో లంచాలకు తెగబడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

ఒక అధికారిని పట్టుకుకున్నారన్న భయం కూడా లేకుండా తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇద్దరు అధికారులు ఏసీబీకి చిక్కడంతో కమర్షియల్ ట్యాక్స్‌పై ఉన్న నమ్మకం  ప్రభుత్వానికి సన్నగిల్లుతోంది. ప్రభుత్వానికి వచ్చే రాబడుల్లో దాదాపు 60శాతం వరకు ఆదాయాన్ని అందించే కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఈ మధ్య కాలంలో నిత్యం వివాదాల్లో చిక్కుకుంటోంది. గత కమిషనర్ శ్రీదేవి వివాదా స్పద నిర్ణయాలు, ఆ తర్వాత రూ.1400 కోట్ల జీఎస్టీ స్కామ్, డిపార్ట్‌మెంట్‌లో అధికారుల మధ్య అంతర్గత విబేధాలతో సతమతమవుతున్న వాణిజ్య పన్నుల శాఖ కు తాజాగా అవినీతి అధికారుల వ్యవహారం తలనొప్పిగా మారింది.

డీసీటీఓలే టార్గెట్‌గా.. 

తాజాగా ఏబీబీకి చిక్కిన ఇద్దరు అధికారు లు కూడా డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు( డీసీటీఓ) కావడం గమనార్హం. జీఎస్టీ వసూళ్లు, వారికి రీఫండ్ చెల్లించే విషయం లో డీసీటీఓల పాత్ర చాలా కీలకం. అంతా వీరి చేతుల్లోనే జరుగుతుంది. ఇదే అదును గా భావించిన కొందరు డీసీటీఓలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. జీఎస్టీ చెల్లింపు విషయంలో ఏదైనా సమస్యలు వస్తే పరిష్కారం కోసం ఆఫీసుకు వచ్చిన వారి నుంచి లంచాలను  డిమాండు చేస్తున్నారు. కొందరు డీసీటీఓల దందాపై కన్నేసిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో కొందరు అధికారును పట్టుకునే క్రమంలో తప్పించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. అందులో భాగంగానే వారం రోజుల క్రితం నారాయణగూడలో సర్కిల్ పరిధిలోని ఓ అధికారి రవ్వంతలో మిస్ అయినట్లు సమాచారం.

ఉన్నతాధికారుల ఆశీస్సులతోనేనా?

తోటి అధికారి ఏసీబీ వలలో చిక్కినా.. ఏ మాత్రం వెరవకుండా.. ఆఫీసర్లు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారంటే.. ఉన్నతాధికా రుల ఆశీస్సులతోనే ఈ వసూళ్ల పర్వం నడుస్తోందన్న ప్రచారం జరుగుతోంది. తమ పైఅధికారే చెబుతున్నారనే ధైర్యంతోనే అక్రమార్జనకు పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.  కమర్షియల్ ట్యాక్స్ శాఖ ద్వారా వచ్చే ఆదాయంపై ప్రభుత్వం అనేక ఆశలు పెట్టకుంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందు ల్లో ఉన్న రాష్ట్రానికి ఈ డిపార్ట్‌మెంట్ ఒకరకంగా కామధేనువు లాంటిది. అంతటి ప్రధా నమైన వాణిజ్య పన్నుల శాఖలో అవినీతి అధికారుల చిట్టా పెరిగిపోతున్న నేపథ్యంలో అటు కమిషనర్, ఇటు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

హైదరాబాద్‌పైనే మొగ్గు..

రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల కంటే హైదరాబాద్, రంగారెడ్డి జిలాల్లో జీఎస్టీ వసూళ్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో వాణిజ్య పన్నుల శాఖలోని అధికారులు ఈ రెండు ప్రాంతాల్లోని సర్కిళ్లలో పని చేసేందుకు ఆసక్తిని కనబరుస్తారనే ప్రచా రం జరుగుతోంది. హైదారాబాద్ పరిధి లో పని చేయాలనుకునే వారిలో డీసీటీఓలు అధికంగా ఉన్నట్లు సమాచారం. జీఎస్టీ తక్కువ వసూలు అయ్యే జిల్లాలకు కేటాయించిన కొందరు డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు కొన్ని సాకులతో హైదరాబాద్, రంగారెడ్డికి డిప్యూటేషన్లపై వస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.