calender_icon.png 18 October, 2024 | 1:19 PM

టార్గెట్ @ 2030..!

27-07-2024 03:39:40 AM

  1. 100 శాతం అక్షరాస్యతే లక్ష్యం 
  2. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక దృష్టి

హైదరాబాద్, జూలై 26 (విజయక్రాంతి): రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకెళ్లాలంటే అక్షరాస్యతే ప్రధానం. రాష్ట్రంలో ఉన్న యువత మొత్తం అక్షరాస్యులై ఉంటేనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించగలదు. ఇందులో భాగంగానే సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యంగా తెలంగా ణ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. వచ్చే ఆరేళ్లలో యువత వంద శాతం అక్షరాస్యత సాధించడంపై సర్కారు దృష్టిసారించింది. 2030 నాటికి దీన్ని చేరుకోవాలని ప్రత్యేక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. తెలంగాణ సామాజిక, ఆర్థిక నివేదిక (సోషియో ఎకనామిక్ ఔట్‌లుక్) రాష్ట్ర ప్రభుత్వం గురువారం బడ్జెట్ సందర్భంగా విడుదల చేసింది. ఇందులో సంపూర్ణ అక్షరాస్యతపై ఈ నివేదిక పలు అంశాలను వెల్లడించింది.

ఆరేళ్లలో సాధించేలా...

తెలంగాణలో 2011నాటికి అప్పటి జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత 66.46 శాతంగా ఉంది. అక్షరాస్యతలో తెలంగాణ రాష్ట్రం ఇతర కొన్ని రాష్ట్రాల కంటే వెనుకబడి ఉండటంతో 2020 జనవరిలో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ‘ఈచ్ వన్ టీచ్ వన్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే దీని ముఖ్య ఉద్దేశం. అయితే ఆశించిన ఫలితాలను ఈ కార్యక్రమం ద్వారా రాబట్టలేదనే విమర్శలున్నాయి. నిజానికి దేశంలో అక్షరాస్యత రేటు నెమ్మదిగా పెరుగుతోంది. 2001 జనాభా లెక్కల ప్రకారం దేశ అక్షరాస్యత 64.83 శాతం ఉండగా, 2011లో అది 74.04 శాతానికి పెరిగింది. 2019 జాతీయ గణాంకాల సర్వే ప్రకారం 77.70 శాతానికి చేరుకుంది. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ (2019 20) ప్రకారం తెలంగాణ రాష్ట్ర అక్షరాస్యత రేటు 73.4%. ఇందులో పురుషుల అక్షరాస్యత రేటు 82% ఉండగా,  మహిళల అక్షరా స్యత రేటు 64.8 శాతంగా నమోదైంది. 

చదువుకు దూరంగా అబ్బాయిలు

చదువుకు దూరంగా 14 సంవత్సరాల వయసున్న పిల్లలు, యువత ఉంటున్నారు. 21.10 శాతం మంది బడులు, కాలేజీలకు వెళ్లడంలేదు. 14 ఏళ్ల వయసున్న వారిలో బడులు, కాలేజీలకు వెళ్లని వారిలో ఎక్కువ మంది అబ్బాయిలే ఉన్నారు. 26 శాతం మంది అబ్బాయిలు కాగా, 17.40 శాతం మాత్రమే అమ్మాయిలు ఉన్నారు. 17 ఏళ్ల వారిని పరిగణలోకి తీసుకుంటే 40 శాతం మంది చదువుకు దూరమైన వారు ఉన్నారు. గత రెండు, మూడేళ్లుగా ఉన్నత విద్యలో అమ్మాయిలే ఎక్కువగా రాణిస్తున్నారు. ఈ అంతరాన్ని తగ్గించేందుకు పాఠశాలలు, కాలేజీలు, ఉన్నత విద్యలో పలు కార్యక్రమాలను చేపడుతున్నట్లు ప్రభుత్వం తెలంగాణ సామాజిక, ఆర్థిక నివేదికలో పేర్కొన్నది. వచ్చే ఆరేళ్లలో యువతలో వంద శాతం అక్షరాస్యత సాధించడమే ధ్యేయంగా లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.