పంజాగుట్ట ఠాణాలో నమోదు
- అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ.. సిద్దిపేట కాంగ్రెస్ నేత చక్రధర్‌గౌడ్ ఫిర్యాదు
- టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుపై కూడా..
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 3 (విజయక్రాంతి) : రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే పలువురు పోలీసు అధికారులతోపాటు రాజకీయ నాయకులను దర్యాప్తు అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. తాజాగా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారంటూ మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావుపై పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
సిద్దిపేటకు చెందిన కాంగ్రెస్ నేత గదగోని చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఈ విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన ఫోన్ ట్యాపింగ్ చేశారని చక్రధర్‌గౌడ్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హరీశ్‌రావుతో పాటు టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావుపై సెక్షన్ 120(బి), 386, 409, 506, రెడ్ విత్ 34, 66 ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పంజాగుట్ట ఎస్‌హెచ్ వో బీ శోభన్ తెలిపారు.
కాగా, హరీశ్‌రావు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డడం టూ చక్ర ధర్‌గౌడ్ గతం లోనే రాష్ట్ర డీజీపీకి, జూబ్లీహిల్స్ ఏసీపీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తన ఫోన్ ట్యాపింగ్ అయినట్లు ఆపిల్ కంపెనీ నుంచి అలర్ట్ మేసేజ్ వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో గతంలో రెండుసార్లు పోలీసులు విచారణ చేశారు. హరీశ్‌రావు తన ఫోన్‌ను ట్యాప్ చేయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్న చక్రధర్ తన వద్ద ఉన్న ఆధారాలను పోలీసులకు అందించారు.
చక్రధర్ గౌడ్ ఫిర్యాదులో..
ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశంతో 2021లో ‘ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్’ అనే సంస్థను నెలకొల్పాను. 2022 సంవత్సరంలో సిద్దిపేటలో ఒక ప్రోగ్రాం నిర్వహించి ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. ఒక లక్ష చొప్పున చేయూతను అందించాను.అలాగే 2023లో 150 మంది విడోలకు స్వయం ఉపాధి కోసం ఒక్కొక్కరికి రూ. ఒక లక్ష చొప్పున ఆర్థిక సహాయం చేశాను. ఆ కార్యక్రమాలకు రాజకీయ నాయకులను ఎవరిని ఆహ్వానించలేదు.
ఇలా క్రమంగా సిద్దిపేటలో నా ఎదు గుదలను చూసి హరీశ్‌రావు నాపై కక్ష పెంచుకున్నారు. ఎలాగైనా తనను అంతం చేయాలని తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని నాపై అక్రమ కేసులు బనాయించి పలుమార్లు జైలుకు కూడా పంపించాడు. అలాగే బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో తన ఫోన్ ట్యాపింగ్ అయిందని ఆపిల్ కంపెనీ నుంచి అలర్ట్ మేసేజ్ వచ్చిందని, దీనిపై గతంలో డీజీపీకి ఫిర్యాదు చేశానని తెలిపారు.
గంటన్నరపాటు పోలీసులు విచారణ జరిపి, స్టేట్ మెంట్ రికార్డు చేశారని చెప్పారు. అప్పటి టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు బీఆర్‌ఎస్ పార్టీలో చేరి.. హరీశ్‌రావుకు సరెండర్ అవ్వాలని, లేకపోతే అక్రమ కేసులు పెడతామని బెదిరింపులకు దిగారని వాపోయారు. తన వ్యక్తిగత ఫోన్‌తో పాటు తన భార్య, డ్రైవర్, తమ కుటుంబ సభ్యుల ఫోన్లు అన్ని ట్యాపింగ్ చేశారని పేర్కొన్నారు.
పోలీసులు అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం ఇచ్చానని, తాము చెప్పినట్లు వినకపోతే తన కుటుంబాన్ని అంతం చేస్తామంటూ రాధాకిషన్‌రావు బెదిరింపులకు దిగారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్‌పై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసి పోరాటం చేస్తున్నానని, న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేసి పోరాటం చేస్తానని చక్రధర్ గౌడ్ స్పష్టం చేశారు.
లక్ష తప్పుడు కేసులు పెట్టినా సరే.. : హరీశ్‌రావు
సీఎం రేవంత్ తనపై లక్ష తప్పుడు కేసులు పెట్టించినా, ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపే ప్రసక్తి లేదని మాజీ మంత్రి హరీశ్ రావు కుండ బద్దలు కొట్టారు. మంగళవారం ఎక్స్‌వేదికగా స్పందిస్తూ అడుగడుగునా నిలదీ స్తున్నందుకు, నిజస్వరూపం బట్టబయలు చేస్తున్నందుకు, ప్రజలపక్షాన ప్రభుత్వంపై ప్రశ్నలు సంధిస్తున్నందుకు భరించలేక, సహించలేక కేసులు బనాయిస్తున్నావని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రికి రేవంత్‌రెడ్డికి చేతనైంది ఒక్కటే పని.. తప్పు చేసి దబాయించడం, తప్పుడు కేసులు పెట్టడం అని ఆరోపించారు. రుణమాఫీ విషయంలో దేవుళ్లను సైతం దగా చేశావని అంటే యాదగిరి గుట్ట పోలీసు స్టేషన్‌లో తప్పుడు కేసు పెట్టించాడని, ఇచ్చిన హామీలను ఎగవేస్తుంటే ఎగవేతల రేవంత్ రెడ్డి అని అన్నందుకు బేగం బజార్ పోలీసు స్టేషన్‌లో తప్పుడు కేసు నమోదు చేయించారని విమర్శించారు.