calender_icon.png 2 October, 2024 | 1:52 PM

చర్మవాద్యం పెద్దమ్మల డోలు

02-10-2024 12:00:00 AM

రుద్దిగాని, గట్టిగా గీచి గాని వాయించే వాద్యాలను ఫంక్షన్ డ్రమ్స్ అంటారు. ఈ శబ్దం ఒకే తీరులో కొనసాగుతుంది. గమకాలు ఏవీ ఉండవు. రుద్దడం వల్ల ఒకే తీరు శబ్దం వస్తుంది. చేతితో వాయించే శబ్దం మాత్రం సన్నివేశాన్ని బట్టి మారుతుంది. కుడి చేత్తో తాళానికి కావలసిన దెబ్బ పడుతుంది. ఎడమవైపు వంచిన కర్రముక్కతో రుద్దుతారు. ఎక్కడైనా ఇదే వరస. పెద్దమ్మల వారు భార్యభర్తలు, శిశువు అందరూ కలిసి సంచారం చేస్తారు.

స్త్రీల నెత్తిన పెద్దమ్మ పెట్టె, భూజానికి చేతిలో అల్లుకున్న చాప, వీపునో, ముందు భాగానో వేలాడే డోలు, కొంగులో శిశువు. పురుషుడు చేతిలో చటాల్ (చర్నకోల వంటిది) మోగిస్తూ భయానక హావభావాలు ప్రదర్శిస్తూ పోతాడు. మధ్య మధ్యలో పొడవైన చటాల్‌తో గాలిలో చట్ చట్ మని శబ్దం చేస్తుంటాడు.

రంగురంగుల దుస్తులు, మెడలో గవ్వల పేర్లు, కాలికి గజ్జెలు, నుదిటిపై రంగుల విభూతి ఇదీ అతని వేషధారణ. సంఖ్యలో వీరు తక్కువ. కాని వీరు ఎక్కడ ఉన్న తమ అస్తిత్వ ప్రదర్శనలో మిన్న. కొందరు తాము ముత్తరాసి సంస్కృతిలోని వారమని చెప్పుకుంటారు. కాని ప్రస్తుతం వీరిది ఏ కులం అనే విషయంలో తర్జన భర్జన పడుతున్నారు. 

పెద్దమ్మల పెట్టెలో పెద్దమ్మతల్లి విగ్రహం ఉంటుంది. ఆ పెట్టెలోపల, పైన చక్కని నకాశీ చిత్రాలు అతికించి ఉంటాయి. పెట్ట తెరవగానే భయంకరమైన రూపంలో పెద్దమ్మ విగ్రహం కొట్టవచ్చినట్లుగా కనిపిస్తుంది. దానిని సరిగ్గా చూపకుండానే తెరుస్తూ వెంటవెంటనే మూసేస్తుంటారు. వీరిలో పురుషులు కనికట్టు విద్యతో ఇంద్రజాల ప్రదర్శనకు మార్మిక సంగీత నేపథ్యాన్ని అందిస్తుంది. 

ఊరి మధ్య కూడలిలో ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. పిల్లలు, పెద్దలు గుమిగూడాక వింత వింత శబ్దాలతో భీకరమైన వాతావరణాన్ని సృష్టిస్తారు. చటాల్ కొరడా మోగుతుంటుంది. తనని తాను వీపు మీద కొట్టుకుంటాడు. రక్తం చారికలతో శరీరం కమిలిపోయి ఉంటుంది. భార్య భూజానికి వేలాడే డోలుపై ఎడమచేతితో గీసుకట్టె లేదా కొట్టుకట్టెతో రుద్దుతుంది.

కుడి చేతితో డోలు వాయిస్తుంటుంది. పుల్లతో రుద్దడం వల్ల ఏర్పడే శబ్దం గరగరామంటుంది. ఇలాంటి శబ్దం మరే చర్మవాద్యం చేయదు. దొమ్మరాటలో పాల్గొనే స్త్రీ కూడా ఇలాంటి శబ్దమే సృష్టిస్తుంది. దక్షిణ భారతదేశంలో ‘మరియమ్మ’ పూజలో ఇలాంటి వాద్యాలను వాయిస్తారు.