calender_icon.png 5 February, 2025 | 2:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తనికెళ్ల భరణి కథలు, కవిత్వం కనికల్ల నిజాలు

20-01-2025 12:00:00 AM

తనికెళ్ల భరణి ఒక మహానటుడుగా జగద్విఖ్యాతులు. ఆయన సినీరంగంలో పోషించని రసం లేదు. ఏ పాత్ర వేసినా ఆయనదంటూ ఓ ప్రత్యేకముద్ర ఉంటుంది. తాను తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకుడు ఆ స్థితిలో లీనమైపోయి రసావేశం పొందుతాడు. నటుడిగా సరే, ఆయనలో ఇతర మానవీయ అంశాలు సైతం ప్రత్యేకించి పేర్కొదగినవి ఎన్నో ఉన్నాయి. వాటిలో సాహిత్యం ఒకటి.

బాగా గమనిస్తే బహుశా ఆయన నటనలో ఇంత పరిపక్వత చూపడానికి సారస్వత ప్రజ్ఞయే ఒక ప్రధాన కారణమై ఉండవచ్చు. ఈ కళా సాహిత్య నేపథ్యమే ఆయనలో అనుభూతి సాంద్రత కలిగించడానికి బహుశా పూర్తి కారణమనుకోవాలి.

ముఖ్యంగా ‘ఎలకలు కొరికిన కథలు’, ‘శభాష్‌రా శంకరా’ ఈ రెండు పుస్తకాలలోకి మనం హృదయస్తంగా వెళితే అనేక ఆలోచనాత్మక అంశాలు మనసులను కదిలిస్తాయి. ‘కొన్ని రోజుల తర్వాత పోయి మళ్లీ దొరికిన కథలను ఎలకలు కొట్టాయని’ తనికెళ్ల ఒకానొక సందర్భంలో చెప్పారు. చివరకు ఆయన కథల పుస్తకానికి ‘అదే’ టైటిల్‌గా మారింది. 

సమాజంలో ఎలుకల లాంటి మనుషులు అనేకమంది ఉన్నారు. వాళ్ళు సగటు మనుషులను, దుర్బలులను కొరుక్కు తింటూనే ఉన్నారు. ఎలుకలు కూడా మధ్యతరగతికి చెందిన మోసగాళ్లకే ప్రతీక. తమ సహజాతులను తామే పీక్కు తినే మనస్తత్వం అనేకమందిలో ఉంటుంది.

ఈ దృష్టితో కూడిన స్పృహ ఆయన కథలు, సాహిత్యాన్ని చదివిన వారికి ఇట్టే తెలిసిపోతుంది. ఈ పుస్తకాలలో కట్టుకథలు, ఊహాతీత కవితలూ లేవు. సమాజంలో మనకు నిత్యమూ సాక్షాత్కరించే కనికల్ల నిజాలు అక్షరాలలో దర్శనమిస్తాయి. సమాజంలో ఒక సానుకూల మార్పుకు ఇవి కచ్చితంగా ప్రేరణలవుతాయి.

మధ్యతరగతి వారి జీవితాలు

భరణి వారి కథలన్నీ మధ్యతరగతి మానవుని చుట్టూ తిరిగేవే. వాటిలో పాత్రలు రోజూ మనం చూసేవే. అద్దె కట్టలేని గుమాస్తా బతుకు ‘పొయ్యిలో పిల్లి’ కథ. పొయ్యిలో మెరుస్తున్న కళ్ళతో పిల్లి. గుమాస్తా దరిద్రాన్ని సూచించడానికి ఇంతకంటే ఏం ప్రతీక కావాలి? శంకరాచార్యుల సూక్తి టైటిల్‌గా ఉన్న ‘కుమాతా నభవతి’ కథలో శిల్పం మనసుల్ని కదిలిస్తుంది. బ్రాహ్మణాచారాలు, సాంప్రదాయ వారసత్వాలను చక్కగా చిత్రీకరించారు.

దీంతోపాటు ఆకలితో నకనకలాడే మానవ హృదయం ఏ విధంగా నిగ్రహాన్ని కోల్పోతుందో చదివితే మనకు కన్నీళ్లు వస్తాయి. ఎంతో నిష్ట గలిగిన కావమ్మ రెండు రోజుల నుంచి అన్నం లేని కొడుకు ఆకలిని కూడా పక్కకు పెట్టేస్తుంది.

చివరకు శనివారం రోజున ఆకలికి తట్టుకోలేక తద్దినం గారెలు తింటుంది. ఇంతేకాదు, జంధ్యాన్ని చెవికి మెలేసి దొడ్డివైపు గణపతి వెళ్లడం, సంధ్యావందనం కోసం పంచపాత్ర, హరివాణం అమర్చడం, ఆచమనం చేయడం, భోజనం చేశాక పసుపుతో శుభ్రం చేయడం, తద్దినాలలో భోక్తగా వెళ్లడం, కావమ్మ తద్దినం పెడుతున్న వాళ్ళింటికి వెళ్లి మడితో వంట చేయడం..

ఇలాంటి సన్నివేశాలను, కుటుంబ వాతావరణాల్ని చక్కగా అక్షరబద్ధం చేశారు. సంప్రదాయం, నిష్ట వంటివన్నీ ఆకలి ముందు ఎలా ఓడిపోతాయో చెప్పిన తీరు అద్భుతం. వ్యవస్థాగతమైన లో పాలను సరిదిద్దడానికి మనిషి చేయాల్సిన పోరాటాలని అన్యాపదేశంగా కథలోని సన్నివేశం సూచిస్తుంది. 

‘ఇక్కడో ఆత్మహత్య జరుగుతుంది’ కథ చలంని గుర్తుకుతెస్తుంది. కథంతా ఉత్తమ పురుషలో నడుస్తుంది. ఒక పురుషుని చుట్టూ ముగ్గురు స్త్రీలు. ప్రియురాలు, చెల్లి, ఇల్లాలు. ఇదో అసమర్థుడి జీవయాత్ర అనాల్సిందే. ముగ్గురు స్త్రీలచుట్టూ తిరిగిన ఈ కథ ఒక అంతర్ముఖమైన బహిర్ముఖత్వం. 

అన్నీ విలక్షణ ఇతివృత్తాలే!

తనికెళ్ల భరణి కథాభివ్యక్తిలో అల్లుకుపోయిన మరో కొత్తదారి ‘కనిపించని రాగం’ కథ. ఇందులో అమ్మాయికి నల్లదనం ఏ విధంగా అవమానాలకి గురిచేస్తుందో చెప్పారు. ‘కాయితం పడవ’ కథ మామూలుగా జరిగే అనేక మధ్యతరగతి కుటుంబాలలో కనిపించే జీవితమే. ఇందులో తనికెళ్ల వారు పోషించిన కథాశిల్పం ప్రత్యేకించి గమనించాలి. సినిమా రంగంలో ముఖ్యమైన వ్యక్తిగా ఉన్న ఆయన ఇలాంటి కథ రాయడంలో ఆశ్చర్యం లేదు.

రచయితల విప్లవభావాలు, చైతన్యస్రవంతి పద్ధతిలో చిత్రించిన గల్పిక ‘మరణ శాసనం’. ఇందులో రచయిత అనుసరించిన శైలి ఆధునికానంతర కవిత్వం శైలిలాగా ఉంటుంది. దిగంబర కవిత్వం చదివిన నాటి జ్ఞాపకాలు కదలాడుతాయి. సమా జంలోని సమస్త అరాచకాలు, దుఃఖం, దైన్యం అక్షరాలుగా పరుచుకున్నాయి. ‘విషోదయం’, ‘జూలీ లేచిపోయింది’.. మానవ లోకాన్ని ప్రతీకాత్మకంగా చిత్రీకరించిన కథలు.

‘మొగుళ్ళకి మాత్రమే’ కథ రచనా కాలం నాటి భార్యాభర్తలను మన ముందుంచుతుంది. ఈ సంకలనంలోని కథలలో ఆయా కాలాల సామాజిక పరిస్థితులు ఎన్నో రకాలుగా మన ముందు నిలబడతాయి. 40 ఏళ్ల కింది తెలుగు మధ్యతరగతి కుటుంబాలకు గొప్ప దర్పణం వంటివి ఆయన కథలు. తనికెళ్ల భరణి సహజంగా కవి. ఆయన వచన రచనలలో కూడా కవిత్వం అప్రయత్నంగా తొంగి చూస్తూ ఉంటుంది.

‘ఆమె అతని నుదుటిమీద పెదాలతో కాల్చింది, అర్ధరాత్రి అందమైన సముద్రం మీద.. అందంగా నిషా చుక్కలు.. నిశాచుక్కలు’ (‘ఇక్కడో ఆత్మహత్య జరుగుతుంది’), ‘ఎంత మృదువైన మందహాసం, నందివర్ధనం పువ్వులా.. స్వచ్ఛంగా’ (‘కవితా ఓ కవితా’) ఇలా కాలాన్ని ప్రతిఫలించే కథలు, అందులో తన భావుకతను దాచుకోలేని తనమే కాకుండా, తానే కవిత్వమై ప్రవహించిన సవ్యసాచివలె సాక్షాత్కారిస్తారు.

పరమాత్మకు ఆత్మనివేదన

‘శబ్బాష్ రా శంకరా’ కావ్యం పరమాత్మకు ఆత్మనివేదన అనడానికి నిలువెత్తు నిదర్శనం. ఇదొక వ్యాజ్యస్తుతి కవిత్వం. తెలుగుపదాలు, అన్యాపదేశాలు కలగలిపి గమ్మత్తయిన శైలిని సాధించారు కవి. ‘గణపతి దేవుడు నీకు బిడ్డ, ఖబరస్తానేమో నీ అడ్డ’, ‘ఆదా చంద్రమ నెత్తిమీద, నీలో ఆదానేమో అమ్మాయె’.. ఇలాంటి ఉర్దూ పదాలు రెండవ పాదంలో వాడడం ద్వారా చదువరులకు అవి ముక్కుసూటిగా తగులుతాయి.

తనికెళ్ల వారి శివతత్త్వ సారానికి ప్రతీకలు ఇందులోని కవితా ఖండికలు. ఈ చిరుకావ్యంలో ఆయన ప్రదర్శించిన సార్వజన సామాజికత ప్రత్యేకంగా గమనించదగ్గది. ‘అమ్మకు బుక్కెడు బువ్వ పెట్టడు, అయ్యకు బుడ్డ పైసియ్యడు. కొడుకులు ఏమిటికి, కొరవి పెట్టనీకా శభాష్ రా శంకరా..!’ అంటూ కరిగిపోతున్న కుటుంబ బంధాల సమస్యను పరమేశ్వరునికి గొప్పగా విన్నవించారు.

‘ఎక్కడ చూసినా రక్తపాతమే, కాలువల పొంటి కన్నీరే, నరకం ఏమిటికి ఇంక మాకు నాయనా..’ వంటి పాదాలలో కనిపించే ఆర్తి కవి ఆర్ద్ర హృదయాన్ని మనకు పట్టిస్తుంది. ఈ చివరి పాదంలో వారు ప్రయోగించిన సెటైర్ రక్తవంతమైన సమాజ చిత్రాన్ని మనసులో నాటుతుంది.

కోట్ల కోట్లు నోట్లు, పెట్టేది నిండా బంగారం, ఎకరాలున్నుంటే ఏంది ఆరడుగులే...’, ‘గంగమ్మ అంటేనే లొల్లి లొల్లి, నువ్వా సప్పుడు జెయ్యవు, నీళ్లలో నిప్పుతో తగలబెట్టినప్పుడే..’, ‘సావునే సావ నూకినవ్, తాళ్లు తావీజులే, శివునాగ్యైతది సీమనైత’..లాంటి కవిత్వ పాదాలు కవితాప్రియులని వదలకుండా హృద్యంగా హత్తుకుంటాయి.

ఇక తెలంగాణ జాతి జనులు వాడుకునే పదాలకు ఈ కవిత్వంలో కొరతే లేదు. ‘దెల్సుకోనీకి, పాగల్గానిగా, ముంచుతర్ర, ఖాందాన్, యాటకూర, బేఫికర్, బరుబాదయే’.. ఇట్లాంటి ఎన్నైనా ఉదాహరణలు ఇవ్వవచ్చు. ‘పచ్చని చెట్లు గొడితే’, ‘భూమాతకు గుండెల పొక్క పెడితే’, ‘ఆకాశంలో పిట్ట లేదు’, ‘జీవాల్లేవు అడవుల్ల’.. వంటి పద్య ప్రయోగాలు కవి పర్యావరణ స్పృహకు నిదర్శనాలు.

నిజానికి తనికెళ్ల వారి మొత్తం సాహిత్యం మీద సమగ్ర అధ్యయనానికి విశ్వవిద్యాలయాల పరిశోధకులు ముందుకు రావాలి. ఆయన ప్రతీ కవిత్వంలో, వచనంలో, చివరకు యథాలాపంగా మాట్లాడే మాటల్లో సైతం అమోఘమైన సృజనాత్మక భాషా ప్రయోగాలు, సవ్యసాచిత్వ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఆయన సినీనటుడు కావడం ప్రేక్షకుల అదృష్టం కావచ్చు కానీ, ఇది సాహితీ లోకం దురదృష్టం అని చెప్పాలి.