వాళ్లంతా గిరిజన మహిళలు.. అక్షరం ముక్క రాదు. బాహ్య ప్రపంచమేంటో కూడా తెలియదు. కానీ తమ ఆలోచనలకు పదునుపెట్టి ఆర్థిక స్వావలంబన దిశగా దూసుకుపోతున్నారు. ఆకట్టుకునే హస్త కళలతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. కేవలం చేతి నైపుణ్యంతోనే అమెరికా, జర్మనీ దేశాలను సైతం ఆశ్చర్యపడేలా చేస్తున్నారు. బంజారా కళకు ఆధునిక సొబగులు అద్దుతూ, తమ అల్లికలతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన మహిళల సక్సెస్ స్టోరీ ఇది.
మర్రిచెట్టు తండా.. నల్లగొండ జిల్లా, దేవరకొండ పట్టణానికి కూతవేటు దూరంలో ఉంటుంది. అయినా అభివృద్ధికి అమడదూరమే. తండాలో దాదాపు 200 కుటుంబాలు ఉంటే.. అంతా వ్యవసాయ పనులు, కూలీ చేసుకుంటూ జీవనం కొనసాగించేవారు. రోజంతా కష్టపడితే వచ్చేది 300 రూపాయలు మాత్రమే.
అధికారులకుకానీ, రాజకీయ నాయకులకు అక్కడో తండా ఉందనే విషయం కూడా తెలియదు. కానీ సీన్ కట్ చేస్తే.. ప్రస్తుతం మర్రిచెట్టు తండా కళల కాణాచిగా పేరొందింది. మహిళలకు ఉపాధి అడ్డాగా మారింది. బంజారా కళలను ప్రపంచానికి పరిచయం చేస్తూ ఆర్థికంగా లబ్ధిపొందుతున్న ఈ మహిళల వెనుక ఎంతో శ్రమ ఉంది.
ఆర్థిక స్వావలంబన దిశగా..
బంజారా ఆరాధ్య దైవం ’సేవాలాల్ మహారాజ్. బంజార భాష, వేష, సంస్కృతి అంతరించిపోకుండా కాపాడారు. ఆయన స్పూర్తితోనే తండాలో 80 శాతం మహిళలు ఆనాటి దుస్తులను ధరిస్తున్నారు. మార్కెట్లో రకరకాల దుస్తులు అందుబాటులోకి వస్తున్నప్పటికీ ఇక్కడివాళ్లు ఆనాటి ఆచార వ్యవహరాలకు ప్రాధాన్యతస్తుండటం విశేషం.
బంజారా కళను పదిమందికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో తండా మహిళలంతా ఒక్కటయ్యారు. ఒక్కో గిరిజన మహిళ రోజుకు కుట్టు, అల్లికలతో రూ.500 నుంచి రూ.1500 వరకు సంపాదిస్తున్నారు. సూదీ దారం కుట్లతో దుస్తులను తయారుచేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు.
“బంజారా కళకు బాగా డిమాండ్ ఉండటంతో ఇతర తండాల మహిళలు మర్రిచెట్టు తండాలో ఉపాధి పొందుతున్నారు. చేతి అల్లికల ద్వారా బాగా సంపాదిస్తున్నాం. ఒకవైపు వ్యవసాయ పనులు చేసుకుంటూ.. మరోవైపు బంజారా క్రాఫ్టును తయారుచేస్తున్నాం. మా కళను పదిమందికి పరిచయం చేయడం సంతోషంగా” అని అంటున్నారు తండా మహిళలు.
విదేశాల్లో డిమాండ్
గిరిజన పండుగ తీజ్, ఇతర పర్వదినాల్లో బంజారా దుస్తులకు ఎక్కడాలేని క్రేజ్ ఉండటంతో ఇక్కడి మహిళలు ఈ కళనే ఆదాయ వనరుగా మార్చుకున్నారు. కాలి మెట్టల నుంచి తలపాగా వరకు ఎన్నో అద్భుతమైన అల్లికలను తయారుచేస్తున్నారు. వీరి శ్రమను, ప్రతిభను నాబార్డు (నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్) గుర్తించడంతో మర్రిచెట్టు తండా వెలుగులోకి వెలుగులోకి వచ్చింది.
పేటియా (లంగ), కాణి (రవిక), ఠుక్రీ ముసుగు, కవ్య (పెళ్లి అయిన అమ్మాయిలకు), తాక్లీ (పర్సులు), గండో (తపాలగా పైగా ఉండేది), బురియా (ముక్కుపడుగ) లాంటివి ఎన్నో తయారుచేస్తుండటంతో ఢిల్లీ, గుజరాత్, ముంబైతోపాటు జర్మనీ, అమెరికా, ఫ్రాన్స్ దేశాలు సైతం ఈ తండా అల్లికలను దిగుమతి చేసుకుంటున్నాయి. అక్కడ జరిగే ఫ్యాషన్ కార్యక్రమాలతోపాటు ఇంటి అలంకరణగా మర్రిచెట్టు క్రాఫ్ట్‌ను వాడుతుండటంతో ఇక్కడి మహిళలకు చేతినిండా పని దొరికినట్టయింది.
ట్రెడిషనల్ టచ్
ఎలాంటి మిషన్స్ సాయం లేకుండా కేవలం చేతి అల్లికలతో గిరిజన దుస్తులు, కళాకృతులను తయారుచేయడం ఈ మహిళల ప్రత్యేకత. అలాగే ఆనాటి కళకు ఆధునికతను అద్దుతూ (గవ్వలు, అద్దాలు, పూసలు, గజ్జెలు) తయారుచేస్తున్నారు. ప్రస్తుత ఫ్యాషన్‌కు అనుగుణంగా బంజా బ్యాంగిల్స్, సెల్ ఫోన్ పౌచ్స్, జ్యూట్ బ్యాగ్స్, ఇతర రకాల ఎంబ్రయిడరీ తయారుచేస్తూ ఆర్థికంగా లాభపడుతున్నా రు.
ఈ క్రమంలో హస్లో (ఎడువారాలో నగలు, హస్లి (నక్లెస్), క్వాడీ (గవ్వల మాల) లాంటివి బాగా అమ్ముడుపోతున్నాయి. “ప్రస్తుతం మా తండాలో చాలామంది బంజారా ఆర్ట్‌పై ఆధారపడి పనిచేస్తున్నాం. మేం తయారుచేసే వస్తువులు విదేశాల్లో వెళ్తున్నాయి.
మంచి లాభాలు కూడా వస్తున్నాయి. దళారులు లేకుండా మా వస్తువులను మేమే అమ్ముకుంటున్నా. మా పిల్లలు కూడా ఈ కళను నేర్చుకుంటున్నారు. ప్రస్తుతం ‘మర్రిచెట్టు బంజారా క్రాఫ్ట్’ ఏర్పడి వస్తువులను మార్కెటింగ్ చేసుకుంటున్నాం” అని అంటున్నారు వీళ్లంతా.
బాలు జాజాల
చాలా గర్వంగా ఉంది
నాకు తెలిసిన కళతోనే రోజుకు 1000 రూపాయలు సంపాదిస్తున్నా. ఇతర పనులు చేసుకుంటూనే.. తీరిక దొరికినప్పుడల్లా అల్లికలు తయారుచేస్తున్నా. ఒక్కో వస్తువుకు వారం రోజుల నుంచి 20 రోజుల సమయం పడుతుంది. మేం చేసే వస్తువులు చూసేందుకు వీదేశస్తులు తండాకు రావడం గర్వంగా ఉంది. మా అమ్మ మ్మ నానమ్మల ను కళను అంతరించిపోకుండా కాపాడుతున్నందుకు చాలా ఆ నందంగా ఉంది.
మూడావత్ భారతి,
గిరిజన మహిళ
ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలి
విదేశాల్లో మా కళకు బాగా ఆదరణ ఉంది. అక్కడ దాండియా, బతుకమ్మ, ఇతర ఫ్యాషన్ షోలు జరిగినప్పుడు మా దుస్తులను వాడటా నికి ఇష్టపడుతున్నారు. మర్రిచెట్టు కళాకృతులు అద్భతంగా, అందంగా ఉండటమే ఇందుకు కారణం. ఇప్పటివరకు నాబార్డు మాత్రమే మాకు అండగా నిలిచింది. ప్రభుత్వాలు కూడా స్పందిం చి సబ్సీడీ అంది స్తే చాలామంది గిరిజన మహిళలకు ఉపాధి దొరుకుతుంది.
నేనావత్ శ్రీను నాయక్,
సంఘం నాయకుడు