పీకేఎల్ 11వ సీజన్
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్‌లో తమిళ్ తలైవాస్ రెండు ఓటములు తర్వాత మళ్లీ విజయం బాట పట్టింది. నోయిడా వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ 40-26 తేడాతో యూపీ యోధాస్‌పై విజయం సాధించింది. తమిళ జట్టులో కెప్టెన్ నరేందర్ కండోలా 6 పాయింట్లతో సత్తా చాటగా.. డిఫెండర్ అయిన షఫఘీ 8 పాయింట్లతో విరుచుకుపడ్డాడు.
ఇందులో ఆరు రెయిడ్ పాయింట్లు ఉండడం గమనార్హం. తొలి అర్ధభాగం ముగిసే సరికి 12-17 తేడాతో వెనుకబడిన తమిళ్ తలైవాస్ రెండో అర్ధ భాగంలో రెచ్చిపోయింది. ఏకంగా 28 పాయింట్లు సాధించి ప్రత్యర్థికి అందనంత ఎత్తులో నిలిచింది. అదే సమయంలో యూపీ జట్టు కేవలం 9 పాయింట్లతోనే సరిపెట్టుకుంది.
దీంతో తొలి అర్ధ భాగంలో వెనుకబడినా సమయం ముగిసే సరికి తమిళ్ విజయం సాధించింది. రివేంజ్ వీక్‌లో దబంగ్ ఢిల్లీ, పట్నా పైరేట్స్ మధ్య మ్యాచ్ 39-39తో డ్రాగా ముగిసింది. అప్పట్లో (అక్టోబర్ 31న) పట్నా పైరేట్స్ ఢిల్లీపై విజయం సాధించింది.
పట్నా తరఫున రెయిడర్ దేవాంక్ 15 పాయింట్లు సాధించగా.. ఢిల్లీ తరఫున కెప్టెన్ ఆశు మాలిక్ సూపర్ టెన్‌తో మెరిశాడు. ఆఖర్లో ఢిల్లీకి లభించిన సూపర్ టాకిల్ గేమ్‌ను పూర్తిగా మార్చేసింది. నేటి మ్యాచ్‌ల్లో హర్యానా స్టీలర్స్‌తో పునేరి పల్టన్, బెంగాల్ వారియర్స్‌తో గుజరాత్ జెయింట్స్ తలపడనున్నాయి.