13-03-2025 03:28:51 PM
హైదరాబాద్: సరైన విధానాలు లేకుండా లోక్‌సభ నియోజకవర్గాల డీలిమిటేషన్(Delimitation) చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) పునరుద్ఘటించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా తలపెట్టిన డీలిమిటేషన్ ఎత్తుగడకు వ్యతిరేకంగా అవసరమైతే జాతీయ స్థాయిలో ఆందోళన నిర్వహిస్తామన్నారు. తమిళనాడు మంత్రి(Tamil Nadu Minister) టి.కె.నెహ్రూ ఆధ్వర్యంలో, ఎంపీలు, ఇతర నేతలతో కూడిన డీఎంకే ప్రతినిధి బృందం ముఖ్యమంత్రిని ఢిల్లీలో కలిసి, ఈ నెల 22న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్(Tamil Nadu Chief Minister Stalin) చెన్నైలో నిర్వహిస్తున్న సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానం అందజేశారు. భేటీ అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు.
పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది సహా ఇతర రాష్ట్రాలకు వాటిల్లే నష్టంపై చర్చించడంతో పాటు కేంద్రం కుట్రలను నిలువరించేలా తదుపరి కార్యాచరణ తీసుకోడానికి విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు తమిళనాడు సీఎం స్టాలిన్ ని అభినందిస్తున్నానని తెలిపారు. మా పార్టీ హైకమాండ్ అనుమతి తీసుకొని ఈనెల 22న చెన్నై వేదికగా జరగబోయే సమావేశానికి హాజరువుతానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. దేశ ప్రగతిలో దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం ఎంతో ఉన్నప్పటికీ, కేవలం తమకు రాజకీయంగా పట్టు చిక్కడంలేదనే అక్కసుతో బీజేపీ డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలను లిమిట్ చేయాలని భావిస్తోందన్నారు. ఈ కుట్రలను కచ్చితంగా తిప్పికొట్టి, దేశ సమైక్యతను, ఫెడరల్ స్ఫూర్తిని కాపాడుకుంటామన్నారు. అందుకోసం అవసరమైతే జాతీయ స్థాయిలో ఆందోళన చెపడతామతి సూచించారు. తెలంగాణ రాష్ట్రంలోనూ డీలిమిటేషన్ అంశంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మాజీ మంత్రి జానారెడ్డి సారధ్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు. బీజేపీ సహా అన్ని రాజకీయ పార్టీలతో పాటు పౌర సమాజం ప్రతినిధుల అభిప్రాయాలను తీసుకొని కేంద్రానికి నివేదిస్తామన్న రేవంత్ రెడ్డి ప్రతిఒక్కరు రాజకీయాలకు అతీతంగా స్పందించాల్సిన సందర్భం ఇదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.