18-04-2025 11:17:26 PM
తమిళనాడులో త్రిభాషా సూత్రాన్ని అమలు చేయం అని అమిత్‌షా హామీ ఇవ్వగలరా?
డీలిమిటేషన్‌లో సీట్లు తగ్గించమని చెప్పగలరా?: సీఎం ఎంకే స్టాలిన్
చెన్నై: తమిళనాడులో 2026లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటవుతోందన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ స్పందించారు. ఢిల్లీ పరిపాలనకు లొంగని ప్రత్యేకత తమిళనాడుకు ఉందని.. భాషా వివాదంలో ఇప్పటికే ఆ విషయం కేంద్రానికి తెలిసేలా చేశామన్నారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా పార్టీలను చీల్చడం, ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం లాంటివి ఇక్కడ కుదరవని స్పష్టం చేశారు. 2026 ఎన్నికల్లోనూ డీఎంకేనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడుకు నీట్ నుంచి మినహాయింపు ఇస్తామని.. త్రిభాషా సూత్రాన్ని అమలు చేయబోమని అమిత్‌షా హామీ ఇవ్వగలరా అని ప్రశ్నించారు. డీలిమిటేషన్‌తో సీట్లను తగ్గించమని చెప్పగలరా అని నిలదీశారు. ఇటీవల కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తమిళనాడు ప్రజలను కించపరిచేలా మాట్లాడారని.. అమిత్ షా సైతం అదే విధమైన వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. రాజ్యాంగం ప్రకారమే కేంద్రం, రాష్ట్రాలు ఏర్పాటయ్యాయని.. ఎవరూ ఎవరికి సబార్డినేట్ కాదని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేర్కొన్నారని పునరుద్ఘాటించారు. వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కలిసి పోటీ చేయనుంది. 2026లో తమిళనాట అధికారంలోకి వస్తామని బీజేపీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా.. జాతీయ విద్యలో త్రిభాషా సూత్రం, డీలిమిటేషన్ మొదలైన విషయాలపై తమిళనాడు ప్రభుత్వం, కేంద్రంతో తీవ్రంగా తలపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టాలిన్ ప్రభుత్వం.. కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై విస్తృతంగా పోరాటం చేస్తుంది.