calender_icon.png 16 April, 2025 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

10 చట్టాలను నోటీఫై చేసిన తమిళనాడు ప్రభుత్వం

12-04-2025 06:46:43 PM

చెన్నై,(విజయక్రాంతి): తమిళనాడు రాష్ట్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్ బిల్లులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం శనివారం అధికారిక గెజిట్‌లో పది రాష్ట్ర చట్టాలను నోటిఫై చేసింది. ఈ నిర్ణయం భారత రాజ్యంగ చరిత్రలో ఒక ప్రభుత్వం రాష్ట్రపతి, గవర్నర్ అంగీకారం లేకుండానే కోర్టు తీర్పుతో చట్టాన్ని అమలు చేయడం ఇదే మొదటి సారి. బార్ అండ్ బెంచ్ ప్రకారం... రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టు నిర్ణయం ఆధారంగా ఈ చర్య తీసుకోబడింది. తమిళనాడు శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆర్ఎన్ రవికి పంపినప్పటికీ ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో ప్రభుత్వం విషయంపై 2023లో సుప్రీంకోర్టు ఆశ్రయించింది.

ఏదైనా బిల్లును మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సివస్తే అందుకు గవర్నర్ తీసుకోదగిన సమయం ఒక నెల మాత్రమేనని, గవర్నర్ బిల్లులను ఆమోదించినట్లుగా ప్రకటిస్తూ  సుప్రీంకోర్టు తీర్పు సంచలనాత్మక తీర్పు వెలువరించింది. భారతదేశంలోని ఏ శాసనసభలోనైనా గవర్నర్, రాష్ట్రపతి సంతకం లేకుండా సుప్రీంకోర్టు తీర్పు బలంతో అమలులోకి వచ్చిన మొదటి చట్టాలు ఇవే కాబట్టి చరిత్ర సృష్టించబడిందని సీనియర్ న్యాయవాది, ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) ఎంపీ పి విల్సన్ ఎక్స్ ఖాతాలో  పోస్ట్‌ చేశారు. గవర్నర్ బిల్లును తిరిగి పంపించి, శాసనసభ తిరిగి రెండోసారి ఆమోదించిన తర్వాత కూడా గవర్నర్ రాజ్యాంగబద్ధంగా దానికి ఆమోదం తెలియజేయాల్సి ఉంటుందని, దానిని రాష్ట్రపతికి సూచించలేరని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. 

ఈ తొమ్మిది చట్టాలు ప్రధానంగా విశ్వవిద్యాలయాలపై రాష్ట్ర నియంత్రణకు సంబంధించినవి. గవర్నర్‌ను కీలక సంస్థల ఛాన్సలర్‌గా భర్తీ చేస్తాయి. జస్టిస్ జెబి పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఆర్టికల్ 142 కింద తన అసాధారణ అధికారాలను ఉపయోగించి బిల్లులను తిరిగి అమలు చేసిన తర్వాత గవర్నర్‌కు తిరిగి సమర్పించిన తేదీ నవంబర్ 18, 2023న ఆమోదించినట్లు భావించబడుతుందని తీర్పు ఇచ్చింది. 10 బిల్లులలో ఒకటి మొదట 2020లో ఆమోదించబడింది, మిగిలినవి 2022, 2023 మధ్య ఆమోదించబడ్డాయి. ఆర్టికల్ 200 కింద సకాలంలో సమాచారం అందించకుండా గవర్నర్ బిల్లులను నిలిపివేశారు. 

ఆమోదించబడిన పది చట్టాలు ఇవే:

1. తమిళనాడు మత్స్య విశ్వవిద్యాలయ (సవరణ) చట్టం 2020, 

2.తమిళనాడు పశువైద్య, జంతు శాస్త్రాల విశ్వవిద్యాలయ (సవరణ) చట్టం 2020, 

3. తమిళనాడు విశ్వవిద్యాలయాల చట్టాలు (సవరణ) చట్టం 2022,

4. తమిళనాడు డాక్టర్ అంబేద్కర్ లా యూనివర్సిటీ (సవరణ) చట్టం 2022, 

5. తమిళనాడు డాక్టర్ ఎంజిఆర్. మెడికల్ యూనివర్సిటీ, చెన్నై (సవరణ) చట్టం 2022,

6. తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయ (సవరణ) చట్టం 2022, 

7. తమిళ విశ్వవిద్యాలయ (రెండవ సవరణ) చట్టం 2022, 

8. తమిళనాడు మత్స్య విశ్వవిద్యాలయ (సవరణ) చట్టం 2023, 

9. తమిళనాడు పశువైద్య మరియు జంతు శాస్త్రాల విశ్వవిద్యాలయ (సవరణ) చట్టం, 

10. తమిళనాడు విశ్వవిద్యాలయాల చట్టాలు (రెండవ సవరణ) చట్టం, 2022.