calender_icon.png 29 March, 2025 | 10:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేంజర్‌తో..

22-03-2025 12:00:00 AM

బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్, దర్శకుడు జగన్‌శక్తి కాంబోలో తొలిసారిగా ఓ సినిమా రానుంది. ‘రేంజర్’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ యాక్షన్-ప్యాక్డ్ చిత్రం ఓ జంగిల్ అడ్వెంచర్‌గా ప్రేక్షకుల ముందుకొస్తోంది. లవ్ రంజన్, అంకుర్ గార్గ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ప్రస్తుత వేసవిలో చిత్రీకరణ ప్రారంభిస్తారని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఇందులో అజయ్ దేవగన్ ఫారెస్ట్ రేంజర్ పాత్రను పోషిస్తుండగా, మరో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ ప్రతినాయకుడిగా కనిపించనున్నట్టు ఇటీవల హిందీ మీడియాలో వార్తలొచ్చాయి.

అజయ్, సంజయ్ మధ్య యాక్షన్ సన్నివేశాలు మరో స్థాయిలో ఉంటాయట. దట్టమైన అడవులు, వన్యప్రాణులను తెరపై అద్భుతంగా చూపించేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగించనున్నారట డైరెక్టర్ జగన్‌శక్తి. ఇలా భారీ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో తమన్నా భాటియా కథానాయికగా ఎంపికైనట్టు వినవస్తోంది. ఇటీవల స్త్రీ2 చిత్రంలో ‘ఆజ్ కీ రాత్..’ అంటూ తన అందచందాలతో బాలీవుడ్ ప్రేక్షకుల దృష్టిని ఈ మిల్క్ బ్యూటీ ఆకర్షించిన విషయం తెలిసిందే. మరిప్పుడు అజయ్ దేవగన్‌తో కలిసి ఫారెస్ట్‌లో యాక్షన్ సీక్వెన్స్‌లు చేయడానికి సిద్ధమవుతుందా? అన్న చర్చ మొదలైంది. మరోవైపు టాలీవుడ్‌లో తమన్నా నటించిన ‘ఓదెల2’ విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం విదితమే. ఈ సినిమా నుంచి శనివారం ఓ అప్‌డేట్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.