calender_icon.png 30 April, 2025 | 12:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మావోయిస్టు పార్టీతో చ‌ర్చ‌లు జ‌ర‌పాలి...

29-04-2025 06:44:10 PM

ఆపరేషన్ కగార్ ను ఆపడానికి కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలి..

దళిత, గిరిజన, ఆదివాసీ ప్రజా సంఘాల డిమాండ్..

హనుమకొండ (విజయక్రాంతి): ఆప‌రేష‌న్ క‌గార్ పేరుతో కేంద్ర ప్ర‌భుత్వ బ‌ల‌గాలు మావోయిస్టుల‌పై హ‌త్యా కాండ చేయ‌డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామ‌నీ, ఆ ఆప‌రేష‌న్‌ను వెంట‌నే ఆపాల‌ని దళిత, గిరిజన, ఆదివాసి ప్రజా సంఘాల నాయకులు కేంద్ర‌ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల జేఏసీ కన్వీనర్ సిద్ధబోయిన లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... మావోయిస్టు పార్టీ ప్ర‌తినిధుల‌ను చ‌ర్చ‌ల‌కు పిల‌వాల‌ని మావోయిస్టు పార్టీని అంతం చేయాల‌ని ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, దాని చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో బ‌ల‌గాల‌ను మోహ‌రించి వారినీ తుడిచిపెట్టాల‌ని కేంద్రం ప్ర‌క‌టించింద‌నీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా చివ‌రి మావోయిస్టును చంపేదాకా వ‌దిలిపెట్ట‌బోమ‌ని మాట్లాడటం ప్ర‌జాస్వామిక దేశంలో అత్యంత అభ్యంత‌క‌ర విష‌యం అని తెలిపారు. 

సైన్యం త‌మ సొంత ఆస్తిగా  ఆయ‌న మాట్లాడ‌టాన్ని ఖండిస్తున్నామ‌న్నారు. చ‌ర్చ‌ల‌కు పిల‌వాల‌ని మావోయిస్టు పార్టీ ప్ర‌తినిధులు అడుగుతుంటే వారిని గౌర‌వించి పిలువ‌కుండా తుదిముట్టించేదాకా వ‌ద‌ల‌బోమ‌న‌టం దుర్మార్గ‌మ‌న్నారు.  ఆప‌రేష‌న్ క‌గార్ పేరుతో ఛ‌త్తీస్‌గ‌ఢ్ అడ‌వుల్లో ఆదివాసీల‌ను నిర్మూలించే ప‌ద్ధ‌తిని మోడీ సర్కారు కొన‌సాగిస్తున్న‌ద‌న్నారు. సాయుధ‌లైన మావోయిస్టుల‌కు, పోలీసు బ‌ల‌గాల‌కు మ‌ధ్య జ‌రుగున్న యుద్ధంలా అది లేద‌నీ, బ‌ల‌గాలు అట‌వీ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఆదివాసీల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురిచేసి వారిని అడ‌వుల నుంచి వెళ్ల‌గొట్టేలా ఉంద‌ని చెప్పారు.  అక్క‌డ‌ మాన‌వ‌, ఆదివాసీ, గిరిజ‌న హ‌క్కులను హ‌రణ జ‌రుగుతున్న‌ద‌ని వాపోయారు.

ఛ‌త్తీస్‌గ‌ఢ్ అట‌వీ ప్రాంతంలోని విలువైన ఖ‌నిజ సంప‌ద‌ను స్వ‌దేశీ, విదేశీ కార్పొరేట్ల‌కు క‌ట్ట‌బెట్టే కుట్ర దాని వెనుక ఉన్న‌ద‌ని విమ‌ర్శించారు. ఆప‌రేష‌న్ క‌గార్‌లో  తెలంగాణ‌లోని రెండు మండ‌లాలు కూడా ఉన్నాయ‌ని తెలిపారు. భార‌త్ స‌మ్మిట్‌లో సామాజిక న్యాయం, ప్ర‌జాస్వామ్యం, ఆదివాసీ, గిరిజ‌న హ‌క్కుల‌పై కాంగ్రెస్ పార్టీ డిక్ల‌రేష‌న్‌లు చేస్తే స‌రిపోద‌నీ, ఆదివాసీల‌పై జ‌రుగుతున్న‌ దాడిని ఆపేలా కేంద్రంపై ఒత్త‌డి తీసుకురావాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.