26-03-2025 02:01:39 AM
మహబూబాబాద్. ప్రతినిధి, మార్చి 25: (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాటేటి శ్రీతేజ్ అమెరికా దేశంలో జరిగిన మిస్సిస్సిప్పి 89వ వార్షిక సమావేశంలో నిర్వహించిన అంతర్జాతీయ సద స్సులో పాల్గొని ఉత్తమ ఓరల్ ప్రెజెంటేషన్ విభాగంలో అవార్డును, నగదు బహుమతిని సాదించి మన రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచం నలుమూలల చాటిచెప్పాడు.
సోలనేషియస్ క్రాప్స్ ఇన్పెక్టింగ్ ప్లైటో ప్లాస్మాస్, సీడ్ ట్రాన్స్ మిషన్ ఎపిడెమియోలాజికల్ ఇన్ సైట్స్ అనే అంశాన్ని ప్రదర్శించి, ప్రసంగించారు. అమెరికాలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడమే అరుదైన అవకాశం కాగా అలాంటి విశ్వవేదికపై మన తెలంగాణతేజం తళుక్కున మెరవడం, అవార్డును సహితం స్వంతం చేసుకోవడంతో వివిధ రంగాల ప్రముఖుల నుండి, అనేక వర్గాల ప్రజల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
మాటేటి వారి మూలాలు మహబూబాబాద్ జిల్లాలోనే..
మొదటి నుంచి చదువుకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చే మాటేటి వారి కుటుంబం మూలాలు మహబూబాబాద్ జిల్లాలోని చిన్నగూడురు మండలకేంద్రంలోనే ఉన్నాయి. చిన్నగూడురుకు చెందిన పద్మశాలి కులానికి చెందిన వీరి కుటుంబం నేత వృత్తి కోసం, ఉపాధిని వెతుక్కుంటూ కాగజ్ నగర్ వెల్లి అక్కడే స్థిరపడ్డారు. శ్రీతేజ్ తండ్రి మాటేటి ఏకాంబ్రం బహుముఖ ప్రజ్ఞాశాలి, విద్య ద్వారా విజ్ఞానాన్ని సాదించాలి, విజ్ఞానంతోనే జీవితంలో ఎదురైనా ప్రతి ప్రశ్నకు నిటారుగా నిలబడి సమాధానం చెప్పాలనే సంకల్పం వారిది.
విద్యార్థిగా,యువకునిగా, విద్యావంతునిగా, ప్రభుత్వఉద్యోగిగా, ఉద్యోగసంఘాల నాయకునిగా ఏ..దశలోనూ గుంపులో గోవిందలా.. కాకుండా తనకంటూ ఓ..ప్రత్యేకమైన గుర్తింపును సాదించిన ప్రతిభాశాలి ఏకాంబ్రం. ప్రస్తుతం వారు గిరిజనసంక్షేమ గురుకులాల విభాగంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా హైదరాబాద్ లో ఉన్నత ఉద్యోగంలో ఉన్నారు. మాటేటి ఏకాంబ్రం-పద్మజ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం కాగా పెద్దకుమారుడు శ్రీకర్ హైదరాబాద్ లో గుగూల్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. రెండవ కుమారుడు శ్రీతేజ్ అంతర్జాతీయ స్థాయి సదస్సులో ప్రతిభ చాటి మన తెలంగాణ రాష్ట్రానికి మంచి గుర్తింపును సాదించిపెట్టారు.
శ్రీతేజ్ విద్యాబ్యాసం సాగిందిలా..
శ్రీతేజ్ తండ్రి మాటేటి ఏకాంబ్రం ఉద్యోగరీత్యా పలుప్రాంతాల్లో పనిచేయాల్సి రావడంతో ఆయన విద్యాభ్యాసం కూడా పలుప్రాంతాల్లో సాగింది. ప్రాధమిక విద్యాభ్యాసం కుమరంబీం జిల్లాలోని ఆసిఫాబాద్ లో, ఆ..తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ వరంగల్ లో ఎనిమిదవ తరగతి వరకు చదివారు. తొమ్మిది, పదవ తరగతులు ఎస్‌ఆర్ పాఠశాలలో చదివారు.ఇంటర్మీడియట్ శ్రీచైతన్య బాచుపల్లిలో, డిగ్రీ అగ్రికల్చర్ బిఎస్సీ పంజాబ్ లోని లౌల్లి ప్రొపేషనల్ యూనివర్సిటీలో పూర్తి చేసాడు.
సంవత్సరంపాటు హైదరాబాద్ లో ఉద్యోగం చేసాడు. ఆ..తర్వాత ఇటలీలోని యూనివర్సిటీ ఆఫ్ పలక్ నా లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసాడు. అదే యూనివర్సిటీ లో రెండు సంవత్సరాలపాటు ఉద్యోగం చేసాడు. అమెరికాలోని మిస్సిస్సిప్పి యూనివర్సిటీ రూ.60లక్షల ఫెలోషిప్ మంజూరు చేసి రిసెర్చ్ కోసం ఆహ్వానించడం జరిగింది. గతంలోనూ ఇటలీలోని దోహాలో జరిగిన అంతర్జాతీయ సదస్సులోనూ శ్రీతేజ్ పాల్గొని ప్రసంగించారు. ఇంత చిన్నవయస్సులోనే వివిధ సందర్భాలు, సమావేశాల కోసం శ్రీతేజ్ 18దేశాలలో పర్యటించారు.
ఆసక్తి, నూతన ఆలోచనలతో.
ఎదగాలంటే ఎంచుకున్న రంగం పట్ల ఆసక్తి ఉండాలి, నూతన ఆలోచనలు ప్రతిక్షణం మనసులో కదులుతుండాలి అనేది శ్రీతేజ్ కు ఆయన తండ్రి ఏకాంబ్రం చెప్పిన తొలిపాఠం, ఆ..పాఠమే శ్రీతేజ్ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తుంది... తల్లిదండ్రుల ఆలోచనలకు, ఆశయాలకు అనుగుణంగా ఆదర్శవంతంగా మాటేటి శ్రీతేజ్ ముందుకు సాగాలని, ఆయన భవిష్యత్తు మరింత తేజోవంతంగా ఉండాలని ఎంచుకున్న రంగంలో మరిన్ని మైలురాల్లను దాటుకుంటూ, ఉన్నతశిఖరాలను అధిరోహించాలని కోరుకుందాం.