మీరు తరచుగా బాత్రూమ్‌లో ఫోన్ వాడుతున్నారా..? అవసరం లేకున్నా ఫోన్ పట్టుకువెళ్తున్నారా? అయితే మీరు అనారోగ్య సమస్యల బారిన పడటం ఖాయమని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు.
ప్రస్తుతం చాలామంది బాత్రూమ్‌లో ఫోన్లు వాడుతున్నారు. మొబైల్ వాడకం అలవాటుగా మారడంతో బాత్రూమ్‌లోనూ బ్రౌజ్ చేస్తున్నా రు. అయితే అక్కడ మొబైల్ వాడితే అనారోగ్య సమస్యల బారినపడేలా చేస్తుందని చెబుతున్నారు డాక్టర్లు.
వాష్‌రూమ్‌లో మొబైల్ ఫోన్లను ఉపయోగించడం చాలా సాధారణమైన అలవాటుగా మారిందనీ, టాయిలెట్లో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మల సిరలపై అధిక ఒత్తిడి ఏర్పడి, హేమోరాయిడ్స్‌కు దారితీస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. చాలామంది చాటింగ్ చేస్తూ, రీల్స్ చూస్తూ అరగంటకుపైగా గడుపుతున్నట్లు పలు హెల్త్ సర్వేల్లో తేలిందని అభిప్రాయపడ్డారు.
ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల పాయువు చుట్టూ ఉన్న సిరలపై ఒత్తిడి పెరుగుతుంది. టాయిలెట్ సీట్ కూడా ఆ ప్రాంతంలో ఒత్తిడిని కలిగిస్తుంది. ఎక్కువసేపు కూర్చోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ అనువైనది కానప్పటికీ, అదనపు నిమిషాలు మల ప్రాంతంపై అధిక ఒత్తిడిని కలిగిస్తాయి.
చాలామంది టాయిలెట్లో 30 నుంచి 45 నిమిషాలు గడపడం, తరచుగా రీల్స్, యూట్యూబ్ వీడియోలు లేదా వారి ఫోన్లలో గేమ్స్ ఆడుతున్నట్లు పలు సర్వేల్లో స్పష్టమైంది. ఫైల్స్ సమస్యతోపాటు నొప్పి, దురద, రక్తస్రావం లాంటి సమస్యలు కలిగిస్తాయి. మలబద్ధకంతోపాటు వెన్నెముక మెడపై కూడా ప్రభావం చూపుతుంది.
మీరు మీ ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచినా శానిటైజింగ్ చేసినా మరుగుదొడ్డిని మాత్రం శుభ్రమైన ప్రదేశంగా పరిగణించరు. ఎందుకంటే టాయిలెట్లో అనేక రకాల బ్యాక్టీరియా ఉంటుంది. మీరు మొబైల్ ఫోన్తో గంటలు గంటలు బాత్రూమ్‌లో సమయాన్ని గడిపితే ఆ బ్యాక్టీరియా మీ ఫోన్‌కు అంటుకుంటుంది. మీరు టాయిలెట్ నుండి బయటకు వచ్చిన తర్వాత రోజంతా ఒకే ఫోన్ని ఉపయోగిస్తే ఈ ఫోన్ నుండి బ్యాక్టీరియా సులభంగా మీ శరీరంలోకి ప్రవేశిస్తుంది.
ఎలాంటి కదలిక లేకుండా అలాగే కూర్చోవడం వల్ల రక్త సరఫరా సరిగ్గా జరగదు. మల విసర్జన సాఫీగా ఉండదు. ఈ సమస్యలు రాకుండా నిరంతరం వ్యాయామాలు చేయాలి. దాంతో సరఫరా పెరిగి పెద్దపేగు పనితీరు మెరుగవుతుంది. ఇదివరకే ఉన్న సమస్యలూ తగ్గుతాయి.
టాయిలెట్ లో పది నిమిషాలకు మంచి గడపకూడదు. మలబద్దకం ఉంటే కూడా ఎక్కువసేపు అలాగే కూర్చోకుండా మళ్లీ కాసేపయ్యాక ప్రయత్నించండి. ఎక్కువగా ఒత్తిడి పెట్టడం కూడా మంచిది కాదు. సరిగ్గా నీళ్లు తాగడం,పీచు ఎక్కువున్న పండ్లు, కూరగాయలు, గింజలు తినడం వల్ల పేగు ఆరోగ్యం బాగుంటుంది.
మొబైల్‌ను పరధ్యానంగా ఉపయోగించడం తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తుంది. కానీ తక్కువ సమయం వాడితే ఎలాంటి నష్టాలు ఉండవు. అయినప్పటికీ, ఈ ప్రవర్తన అతిగా మారితే పైఅనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ఫోన్ లేకుండానే బాత్రూమ్‌కు వెళ్లడం అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు డాక్టర్లు.