- కలెక్టర్‌పై దాడిలో కేసీఆర్, కేటీఆర్‌పైనే అనుమానం
- తండ్రీకొడుకులు తలకిందులుగా తపస్సు చేసినా ప్రభుత్వాన్ని అస్థిరపర్చలేరు
- విచారణ నుంచి తప్పించుకునేందుకు కేటీఆర్ ఢిల్లీ టూర్: డిప్యూటీ సీఎం భట్టి
- మా ప్రభుత్వంలోనే నిరసనలకు అనుమతి ఇచ్చాం: మంత్రి పొన్నం
హైదరాబాద్, నవంబర్ 13(విజయక్రాంతి): లగచర్లలో కలెక్టర్, అధికారులపై భౌతిక దాడి వెనుక కేసీఆర్, కేటీఆర్ ఉండొచ్చని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనుమానం వ్యక్తంచేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు తలకిందులుగా తపస్సు చేసినా తమ ప్రభుత్వాన్ని అస్థిరపర్చలేరన్నారు.
తెలంగాణ ఉద్యమంలోనూ బడుగు, బలహీన వర్గాల యువతను రెచ్చగొట్టి ప్రాణాలు కోల్పోయేలా చేశారని.. ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారని విమర్శించారు. లగచర్ల ఘటనను ఖండిస్తూ బుధవారం సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి భట్టి విలేకరులతో మాట్లాడారు. లగచర్లలో దాడి బీఆర్‌ఎస్ కుట్రగా అభివర్ణించారు.
ఈ దాడి వెనుక సురేశ్ ఉన్నట్టు కాల్ డేటా ఆధారంగా తేలిందని.. అసలు వారెవరో తెలుసుకునేందుకు పూర్తి డేటా సేకరించే పనిలో ఉన్నామన్నా రు. అమాయకులను రెచ్చగొట్టి కలెక్టర్‌పై దాడి చేయించారని, ఇందులో ఎంత పెద్దవారు ఉన్నా ఉపేక్షించమని స్పష్టం చేశారు.
కలెక్టర్‌పై భౌతిక దాడులు చేయడం కరెక్టేనా? పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ బయ టకు వచ్చి సమాధానం చెప్పాలి. ఇలాంటి దాడులతో సమాజానికి ఏం సందేశం ఇస్తారు? అని కేసీఆర్‌ను భట్టి నిలదీశారు. భద్రాచలం ఐటీడీఏలో గిరిజనుల కోసం ఎన్నో మంచి పనులు చేసిన ప్రతీక్ జైన్‌పై దాడి చేయించడాన్ని హేయమైన చర్యగా అభివర్ణించారు.
పారిశ్రామిక అభివృద్ధికే ఇండస్ట్రియల్ పార్కులు
రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. కానీ పరిశ్రమలు, ఉద్యోగాలు రావొద్దన్న ఉద్దేశంతోనే బీఆర్‌ఎస్ ఈ దుర్మార్గమైన చర్యలకు దిగిందన్నారు. బీఆర్‌ఎస్ హయాం లో మల్లన్న సాగర్‌తోపాటు ఇతర ప్రాజెక్టులకు భూసేకరణ చేస్తే తాము శాంతి యుతంగా నిరసన తెలిపామని గుర్తు చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులపై దాడులు చేస్తే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్ అత్యంత వెనుకబడిన ప్రాంతమని, దానిని పారిశ్రా మికంగా అభివృద్ధి చేయడానికి ఇండస్ట్రియల్ పార్కులు తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్నారు.
భూ సేకరణలో భూములు కోల్పోతున్న రైతులకు అత్యుత్తమ ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలు ఇవ్వడంతోపాటు పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడుకునేందుకు లగచర్లలో గిరిజనలను రెచ్చగొట్టి బీఆర్‌ఎస్ రాజకీయంగా లబ్ధిపొందాలని చూస్తోందని భట్టి మండిపడ్డారు.
బీజేపీ పెద్దలతో ఒప్పందానికే ఢిల్లీకి..
ఫార్ములా రేసు కేసులో అరెస్టు నుంచి తప్పించుకోవడానికే కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి అక్కడి బీజేపీ పెద్దలతో ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. ఢిల్లీలో కేటీఆర్ ఎక్కడికి వెళ్లారు? ఎవరిని కలిశారనేది తమకు తెలుసునన్నారు. ఆయుష్ టెండర్లతో అటు రాష్ట్ర, ఇటు కేంద్ర ప్రభుత్వాలకు లాభమే జరిగిందన్నారు.
కాషాయ పార్టీతో ఒప్పందం కుదిరాకే మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేయొద్దని చెబుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు ఓటు వేయొద్దని చెబితే.. బీజేపీకి వేయమని చెప్పడమే కదా? అని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీతో పోరాటం అని చెప్పి.. ఇప్పుడు ఆ పార్టీకే ఓటు వేయమని చెప్పడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు.
దేశంలో తాము ప్రత్యామ్నాయంగా నిలుస్తామని గొప్పలు చెప్పి.. టీఆర్‌ఎస్‌ను బీఆర్ ఎస్ మార్చిన మీరు మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పి ఇప్పుడు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఫార్ములా రేసు కేసులో కేటీఆర్‌ను విచారించేందుకు గవర్నర్ సహకరిస్తారన్న పూర్తి విశ్వాసం తమకు ఉందని భట్టి పేర్కొన్నారు. ఒకవేళ గవర్నర్ తిరస్కరిస్తే ఏం చేయాలో తర్వాత ఆలోచిస్తామన్నారు.
పదేళ్లు లాఠీ దెబ్బలు తిన్నాం: మంత్రి పొన్నం
కలెక్టర్, అధికారులపై జరిగిన దాడిపై బీజేపీ వైఖరి ఏంటని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. రైతుల అరెస్టులను ఖండిస్తున్నామంటున్న కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్, డీకే అరుణ ఈ ఘటనపై తమ స్టాండ్ చెప్పాలని డిమాండ్ చేశారు. తమ సర్కారు వచ్చిన తర్వాతే నిరసనలకు అనుమతిస్తున్నామని చెప్పా రు.
ప్రజాపాలనలో ప్రతి ఒక్కరికీ నిరసన తెలిపే హక్కు ఉందని.. శాంతి భద్రతలకు లోబడి నిరనస తెలుపొచ్చని చెప్పారు. అధికారులపై దాడిని కేటీఆర్ ఖండించకపోగా.. సురేశ్ తమ వాడే అని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్‌ఎస్ హ యాంలో పదేళ్లు లాఠీ దెబ్బలు తిన్నాం తప్పితే దాడులు చేయలేదన్నారు.