calender_icon.png 9 October, 2024 | 2:52 PM

తొలి అడుగు అదరాలి

04-10-2024 12:07:55 AM

ప్రతిష్ఠాత్మక మహిళల టీ20 ప్రపంచకప్‌లో మన అమ్మాయిలు తొలి పోరుకు రెడీ అయ్యారు. తొలి మ్యాచ్‌లో పటిష్టమైన న్యూజిలాండ్‌తో తలపడనున్న హర్మన్ సేన విజయంతో మెగాటోర్నీని దిగ్విజయంగా ప్రారంభించాలని కోరుకుందాం..

దుబాయ్: మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా నేడు తొలి పోరుకు సిద్ధమైంది. గ్రూప్-ఏలో భాగంగా భారత్ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఎదుర్కోనుంది. ఇప్పటివరకు అందని ద్రాక్షగా ఉన్న టీ20 ప్రపంచకప్‌ను ఈసారి హస్తగతం చేసుకోవాలని భావిస్తున్న హర్మన్ సేన తొలి అడుగును విజయవంతం చేయాలని ఆశిస్తోంది.

గతంలో ఒకసారి ఫైనల్ చేరిన భారత జట్టు మరో నాలుగు సార్లు సెమీస్ అంచుల వరకు వచ్చి కప్‌ను చేజార్చుకుంది. ఈసారి ఎలాగైనా ఒడిసి పట్టాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ లాంటి పటిష్టమైన జట్టును ఓడించి బోణీ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది.

ఆడిన రెండు వార్మప్ మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించి మంచి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోన్న భారత్ న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లోనూ అదే జోరును ప్రదర్శించాలని చూస్తోంది. ఆసియా కప్ ఫైనల్ అనంతరం రెండు నెలల పాటు ఎలాంటి మ్యాచ్ ఆడని హర్మన్ సేన మెగాటోర్నీలో ఎలాంటి ప్రదర్శన ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

అన్ని విభాగాల్లో పటిష్టంగా..

ప్రపంచకప్‌కు సిద్ధమైన టీమిండియా ఈసారి బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తోంది. ఓపెనర్లుగా షెఫాలీ వర్మ, స్మృతి మంధాన బరిలోకి దిగనున్నారు. మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంధాన జట్టుకు కొండంత బలం. ఇక మిడిలార్డర్‌లో దయాలన్ హేమలత, జెమీమా రోడ్రిగ్స్‌తో పాటు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ టచ్‌లో ఉండడం సానుకూలాంశం.

ఇక హార్డ్ హిట్టర్‌గా పేరు పొందిన రిచా ఘోష్ రూపంలో భారత్‌కు మంచి ఫినిషర్ ఉంది. బౌలింగ్ పరంగా కూడా భారత్ బాగానే ఫుంజుకుంది. ఆల్‌రౌండర్ దీప్తి శర్మతో పాటు రాధ యాదవ్, ఆశా శోభన, శ్రేయాంకలతో స్పిన్ విభాగం బలంగా కనిపిస్తోంది. ఇక పేస్ విభాగంలో రేణుకా సింగ్ కొత్త బంతితో రాణించడం భారత్‌కు కీలకం.

పూజా వస్త్రాకర్‌తో పాటు తెలుగమ్మాయి అరుంధతీ రెడ్డి ఇటీవల కాలంలో బాగా రాణిస్తున్నారు. ఇక కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కు ఇదే చివరి ప్రపంచకప్ అయ్యే అవకాశముండడంతో ఎలాగైనా టైటిల్ సాధించాలనే పట్టుదలతో మన అమ్మాయిలు బరిలోకి దిగుతున్నారు. 

సౌతాఫ్రికాతో వెస్టిండీస్ ఢీ..

మరోవైపు రెండుసార్లు టీ20 ప్రపంచకప్ రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ జట్టు కూడా పటిష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ సోఫీ డివైన్‌తో పాటు సీనియర్ ఆల్‌రౌండర్ సుజి బేట్స్ కీలకం కానున్నారు. వీరితో పాటు యువ ఆల్‌రౌండర్ అమేలియా కెర్, లియా తాహుహు, లీహ్ కాస్ప్రెక్‌లు కూడా రాణించే అవకాశముంది. ఇక మరో పోరులో గ్రూప్ నుంచి దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. 

భారత జట్టు అంచనా: 

హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, హేమలత, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, అరుంధతీ రెడ్డి, రేణుకా సింగ్.

నేడు కివీస్‌తో భారత్ అమీతుమీ

దుబాయ్ వేదికగా మ్యాచ్

రాత్రి 7.30 నుంచి