21-03-2025 01:00:01 AM
భద్రాద్రి కొత్తగూడెం మార్చి 20 (విజయ క్రాంతి): గిరిజన విద్యార్థిని, విద్యార్థులు మనసులో ఎటువంటి భయాందోళనలు పెట్టుకోకుండా పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను ధైర్యంగా ,ఏకాగ్రతతో పరీక్షలను వ్రాయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ అన్నారు. గురువారం సాయంత్రం లక్ష్మీదేవి పల్లి మండలం సర్వారం గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనసుపెట్టి పరీక్షలు బాగా వ్రాసి, 10/10 గ్రేడ్ లో పాస్ కావాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాలలోని విద్యార్థుల క్రీడలను పరిశీలించి విద్యార్థులతో కలిసి షటిల్ బ్యాట్మెంటన్ ఆడిన అనంతరం పదవ తరగతి పిల్లలకు హాల్ టికెట్ అందించి శుభాకాంక్షలు తెలిపారు. రేపటి నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం అవుతున్నందున పరీక్షా కేంద్రానికి సకాలంలో చేరుకోవాలని, బయలుదేరేటప్పుడు హాల్ టికెట్ పరీక్ష ప్యాడ్ అవసరమైన వస్తువులన్నీ సరిచూసుకొని వెళ్లాలని అన్నారు.
అనంతరం పాఠశాలల్లో మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాలు అందిస్తున్నది లేనిది విద్యార్థులను అడిగి తెలుసుకుని భోజనం చేశారు.అనంతరం క్రీడాకారులకు క్రీడలకు సంబంధించిన మెటీరియల్ అందజేశారు. కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఏటీడీవో చంద్రమోహన్, క్రీడల అధికారి గోపాలరావు, పాఠశాల హెచ్‌ఎం శ్రీనివాస్ మరియు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.