02-04-2025 12:00:00 AM
భద్రాద్రికొత్తగూడెం, ఏప్రిల్ 1 (విజయక్రాంతి ):వేసవి ఎండలు తీవ్రరూపం దాలుస్తున్న పరిస్థితిలో గ్రామీణ , పట్టణ ప్రాంతాల్లో తాగు నీటి ఎద్దడి నివారణకు పటిష్టమైన చెర్యలు చేపట్టాలని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొత్తగూడెం, పాల్వంచ మున్సిపల్, పబ్లిక్ హెల్త్, భగీరథ, ఆర్ డబ్ల్యూ ఎస్, గ్రిడ్ అధికారులతో సమీక్షా నిర్వహించారు.
ఈ సందర్బంగా కూనంనే ని మాట్లాడుతూ ప్రతిపాదనలో ఉన్న మంచినీటి పథకాలు, బోర్లు, పైప్ లైన్లను తక్షణమే పూర్తి చేసి ప్రజలు అందుబాటులోకి తేవాలని, మరమ్మతులకు గురైన బోర్లు, పైప్ లైన్లను, మంచినీటి త్యాంకులకు తక్షణమే మరమత్తులు చేయాలనీ ఆదేశించారు.
ఎక్కడ తాగునీటి సమస్య ఉన్నా అధికారులు స్పందించి పరిస్కారానికి చర్యలు తీసుకోవాలని, తాగునీటి సమస్య పరిస్కారానికి కావాల్సిన నిధులు కేటాయించే విషయంలో తొలి ప్రాధాన్యత ఇస్తానని, ఎన్ని నిధులైనా కేటాయించేందుకు వెనుకాడేది లేదన్నారు. నీటి సమస్య పరిస్కారంకోసం నియోజకవర్గానికి మంజూరైన రూ.1.90 కోట్ల నిధులకు సంబందించిన పనులు తక్షణమే ప్రారంభించాలని, త్వరితగతిన పూర్తి చేయాలనీ సూచించారు.
నీటి పథకాలకు కావాల్సిన నిధుల ప్రతిపాదనలు తక్షణమీ అందించాలని సూచించారు. మంచినీటి సమస్యపై ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందినా అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని, విధులపట్ల అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సమీక్షలో మున్సిపల్ కమిషనర్ సుజాత, పబ్లిక్ హెల్త్ డి ఈ శ్రీనివాస్, మిషన్ భగీరథ డ్ ఈ సాయి, ఆర్ డబ్ల్యూ ఎస్, ఎస్ డీ ఈ శివయ్య, మున్సిపల్ డి ఈ రవి కుమార్, ఏఈలు పాల్గొన్నారు.