04-03-2025 11:44:55 PM
అధికారులను ఆదేశించిన కలెక్టర్ జితేష్ వి పాటిల్...
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలంలో ప్రభుత్వానికి సంబంధించిన ఖాళీగా ఉన్న భూములు రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండి ఎవరు కబ్జా చేసుకోకుండా పరిరక్షించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సంబంధిత రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం చర్ల మండలంలో అధికారిక పనులలో పాల్గొని తిరిగి కొత్తగూడెం వెళుతూ భద్రాచలం అయ్యప్ప స్వామి దేవస్థానం పక్కన ఉన్న ఖాళీ స్థలంను ఆయన రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు.
ప్రభుత్వ భూమి పరిధి ఎంతవరకు ఉన్నది దానికి సంబంధించిన వివరాలు రికార్డులో ఎంతవరకు నమోదయి ఉన్నది పూర్తి వివరాలు సేకరించాలని ఆర్డీవోకు సూచించారు. ఈ ఖాళీ స్థలంలో భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగకరమైన నిర్మాణాలు చేపట్టడానికి వెసులుబాటు ఉంటుందని అందుకు తప్పనిసరిగా దాని వివరాలు పూర్తిస్థాయిలో సేకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఆర్డీవో దామోదర్ రావు, తాసిల్దార్ శ్రీనివాస్, ఆర్ ఐ నరసింహారావు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.