18-04-2025 12:00:00 AM
అధికారులకు మంత్రి కొండా సురేఖ ఆదేశం
హైదరాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): తెలంగాణలో ఎకో టూరిజంపై వేగంగా అడుగులు వేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖామంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయం లో తన చాంబర్‌లో మంత్రి కొండా సురేఖ అధికారులతో తెలంగాణ హరిత నిధి రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విదేశీయులను కూడా ఆకర్షించే విధంగా ప్రణాళికలు రూపకల్పన చేయాలని సూచించారు. అటవీ, టూరిజం, పరిశ్రమల శాఖలతో కూడా ప్రత్యేక సమావేశం నిర్వహించాలన్నారు. నర్సరీలు ఏర్పాటు చేయడం, మొక్కలు నాటడం, పచ్చదనంపై అవగాహన పెంచే కార్యక్రమాలపై ప్రత్యేక సలహాలు ఇచ్చారు. 2024-25 హరిత నిధి బడ్జెట్, 2025-26 బడ్జెట్‌ల ఆమోదానికి మంత్రి అనుమతులు తీసుకున్నారు.
వానరాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వనాలను వీడిన కోతులు మళ్లీ అడవి బాట పట్టవని, వాటి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ ఆర్‌ఎం డోబ్రియాల్, పీసీసీఎఫ్ ఏలూ సింగ్ మేరు, సీసీఎఫ్ జి.రామలింగం, భీమానాయక్, ప్రభాకర్, పలు జిల్లాల డిఎఫ్‌ఓలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.