calender_icon.png 13 March, 2025 | 8:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భయాందోళనలు లేకుండా పరీక్షలు రాయాలి

13-03-2025 02:03:18 AM

జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ 

జగిత్యాల, మార్చి 12 (విజయక్రాంతి): పదవ తరగతి విద్యార్థులు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని కలెక్టర్ బి.సత్యప్రసాద్ సూచించారు. జిల్లా లోని  10వ తరగతి విద్యార్థులకు బుధవారం వర్చువల్ మీటింగ్ ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ బిఎస్.లత, జిల్లా విద్యాధికారి కే.రాము పలు సూచనలు చేశారు.

2024- 25 విద్యా సంవత్సర 10వ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు భయాందోళనలు  లేకుండా పూర్తి సన్నద్ధతతో, ఉపాధ్యాయుల  సూచనలు పాటిస్తూ పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని కోరారు. విద్యార్థులకు సరఫరా చేసినటువంటి పంచ సూత్రాలను, ప్రశంసా పత్రాల ద్వారా తగు సలహాలు పాటించి ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

జిల్లా అదనపు కలెక్టర్  బిఎస్.లత విద్యార్థులతో మాట్లాడుతూ విద్యార్థులు ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో సరైన సమాధానాలు రాసి మంచి ఫలితాలు రాబట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి రాము మాట్లాడుతూ  కలెక్టర్, అదనపు కలెక్టర్ సూచించిన విధంగా ప్రతి విద్యార్థి పరీక్ష రాసే జాగ్రత్తలు తీసుకోవాలని, ఆరోగ్య నియమాలు పాటిస్తూ ఉత్తమ ప్రతిభ కనబరచాలన్నారు.

ప్రతి ప్రశ్నకు సమాధానం రాబట్టే ప్రయత్నం చేయాలని, పార్ట్ ’బి’ ప్రశ్నపత్రంలో ఎటువంటి తప్పిదాలు దొర్లకుండా చూసుకోవాలని, మన జిల్లాను మొదటి స్థానంలో నిలబెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్లు, సాంకేతిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.