03-04-2025 08:47:23 PM
జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య..
మంచిర్యాల (విజయక్రాంతి): వృత్యంతర శిక్షణ అనేది ప్రతి ఉద్యోగికి అత్యవసరమని, నూతనమైన అంశాలు నేర్చుకోవడానికి, విజ్ఞానాన్ని నవీకరించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయని మంచిర్యాల జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ యాదయ్య పేర్కొన్నారు. ప్రమోషన్ పొందిన ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, ప్రాథమిక పాఠశాలల ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులకు గర్మిళ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ శిబిరానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
ప్రధానోపాధ్యాయులు పాఠశాలకు నాయకులని, వారి నాయకత్వ లక్షణాలు విద్యార్థుల అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని, ఈ రెండు రోజుల శిక్షణ కార్యక్రమంలో పాఠశాల నాయకత్వ అభివృద్ధిపై అనేక అంశాలు చర్చిస్తారన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పాఠశాలలను చక్కగా నడపాలని, విద్యార్థులకు సంపూర్ణ మూర్తిమత్వాన్ని సాధింపజేసేలా ఉపాధ్యాయులందరితో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. శిక్షణ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు చౌదరి, సత్యనారాయణమూర్తి, స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కరుణాకర్, రిసోర్స్ పర్సన్లు మల్లేశం, రాజగోపాల్, శేఖర్, ప్రభాకర్, హెచ్ ఎంలు తదితరులు పాల్గొన్నారు.