calender_icon.png 29 November, 2024 | 9:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

29-11-2024 07:35:04 PM

జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి

కుమ్రంభీం అసిఫాబాద్ (విజయక్రాంతి): రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో రైతులు తమ ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధరతో లబ్ధి పొందాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శుక్రవారం రెబ్బెన మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. రైతుల సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరకు రైతుల వద్ద నుండి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని, సన్నరకం వడ్లకు మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ అధికంగా ఇస్తుందని తెలిపారు.

కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు నిబంధనలు పాటిస్తూ నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తెలిపారు. ప్రభుత్వం సన్నరకం వడ్లకు బోనస్‌ ఇస్తున్నందున సన్నరకం, దొడ్డురకం వడ్లను వేర్వేరుగా కొనుగోలు చేయాలని, సన్నరకం ధాన్యాన్ని వ్యవసాయ విస్తరణాధికారులు గుర్తించి ధృవపత్రం జారీ చేయాలని తెలిపారు. క్వింటాల్‌ ఏ గ్రేడ్‌ రకానికి 2 వేల 320 రూపాయలు, సాధారణ రకానికి 2 వేల 300 రూపాయలు చెల్లించడం జరుగుతుందని, కొనుగోలు చేసిన వెంటనే రైతుల వివరాలు ట్యాబ్‌లలో నమోదు చేయాలని, సంబంధిత రైతుల ఖాతాలలో త్వరితగతిన నగదు జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే సమయంలో 17 శాతం కంటే తక్కువగా తేమ శాతం ఉండాలని, తాలు, మట్టిగడ్డలు లేకుండా నిబంధనలను పాటిస్తూ నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాలని, కొనుగోలు కేంద్రాలలో రైతుల సౌకర్యార్థం మౌళిక వసతులు కల్పించడం జరిగిందని తెలిపారు. 

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి:

మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, కళాశాల లను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం, ఆహారం తయారీలో వినియోగిస్తున్న నిత్యవసర సరుకులు, కూరగాయలతో పాటు విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు మెను ప్రకారం సకాలంలో పోషక విలువలు గల ఆహారాన్ని అందించాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.

ఆహారం తయారీలో తాజా కూరగాయలు, నాణ్యమైన సామాగ్రిని వినియోగించాలని తెలిపారు. విద్యార్థులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని, అవసరమైన విద్యార్థులకు వైద్య సేవలు అందించాలని తెలిపారు. ప్రభుత్వం పాఠశాలలలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించిన నాణ్యమైన విద్యార్థులు అందించడం జరుగుతుందని తెలిపారు. వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, కార్యచరణ ప్రకారం సిలబస్‌ పూర్తి చేయాలని తెలిపారు. 

వివరాలను స్పష్టంగా నమోదు చేయాలి:

రెబ్బేన మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో సేకరించిన వివరాలను ఆన్‌లైన్‌ పోర్టల్‌లో  నమోదు చేసే ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్యుమరేడర్లు సేకరించిన వివరాలను ఎలాంటి పొరపాట్లు లేకుండా స్పష్టంగా నమోదు చేయాలని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియలో ప్రత్యేక అధికారులు, సూపర్‌వైజర్లు, ఎన్యుమరేటర్లను నియమించి జిల్లాలోని అన్ని కుటుంబాల వివరాలను నిర్ధిష్ట నమూనాలో పొందుపరిచిన అంశాల ప్రకారం పూర్తి స్థాయిలో సేకరించడం జరిగిందని తెలిపారు. డాటా ఎంట్రీ ఆపరేటర్లు ప్రతి రోజు వారికి కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి స్థాయిలో చేయాలని, ఎలాంటి అలసత్వం, నిర్లక్ష్యం వహించకుండా వివరాల నమోదులో శ్రద్ధ వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి గౌడ్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.