19-03-2025 09:08:19 PM
కామారెడ్డి (విజయక్రాంతి): దివ్యాంగుల విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ఉంటే జీవితంలో అద్భుత ఫలితాలు సాధించవచ్చని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సమగ్ర శిక్ష, భారతీయ దివ్యాంగుల పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో.. జరిగిన జిల్లా స్థాయి దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాల పంపిణీ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ దివ్యాంగులను వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ.. వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపాలన్నారు. ప్రభుత్వం దివ్యాంగులకు అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
2014 లో ఒక దివ్యంగా విద్యార్థి సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో టాపర్ గా నిల్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. జిల్లాలో గుర్తించబడిన 207 మంది దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేశారు. భవిత కేంద్రాలను సమర్థంగా నిర్వహించాలని ఆయన కోరారు. జిల్లా విద్యాశాఖ అధికారి రాజు మాట్లాడుతూ.. జిల్లాలో జరుగుతున్నటువంటి సహిత విద్య కార్యకలాపాలను వివరించారు. ఈ సందర్భంగా దివ్యాంగ పిల్లలు పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా సమగ్ర శిక్ష సమన్వయ కర్తలు నాగ వేందర్, కృష్ణ చైతన్య, వేణుగోపాల్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీపతి, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు గోవర్ధన్, సహిత విద్య రిసోర్స్ పర్సన్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.