03-04-2025 12:00:00 AM
అదనపు కలెక్టర్ వీరారెడ్డి
యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): రాజీవ్ యువ వికాస పథకం కింద దరఖాస్తు చేసుకునే తేదీని ఏప్రిల్ 14 వరకు పొడగించినందున, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. బుధవారం రోజు కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లాలోని అందరు మండల పరిషత్ అభివృద్ది అధికారులు, మున్సిపల్ కమీషనర్లు, ఎంపీడీవో లతో సమావేశము ఏర్పాటు చేసి రాజీవ్ యువ వికాసం పథకం అమలు చేయుటకు తగు సూచనలు జారీచేసినారు.
నిరుద్యోగ ఎస్ సి, ఎస్ టి, బి సి, మైనారిటీ, ఓ బి సి, ఈ బీసీ యువతకు అమలు పరుచబడు రాజీవ్ యువ వికాస్ పథకానికి మండల ప్రజా పాలన సేవా కేంద్రాలు, మున్సిపల్ ప్రజా పాలన సేవా కేంద్రాలలో మాన్యువల్ గా దరఖాస్తు చేసుకోవాలని అదనపు కలెక్టర్ అన్నారు.రాజీవ్ యువ వికాసం పథకం కింద స్వయం ఉపాధి పొందేందుకుగాను ఏప్రిల్ 14 లోగా మండల ప్రజా పాలన సేవా కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాలలోని ప్రజాపాలన సేవా కేంద్రాలలో మాన్యువల్ గా దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు.
జిల్లాలో రాజీవ్ యువ వికాసం కింద ఇప్పటి వరకు14000 దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా స్వీకరించడం జరిగిందని తెలిపారు. కార్యాలయంలో ప్రత్యేకించి రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించి ప్రజాపాలన సేవా కేంద్రాన్ని, హెల్ప్ డిస్క్ ను ఏర్పాటు చేయాలన్నారు. మాన్యువల్ దరఖాస్తులను స్వీకరించేందుకుగాను, అన్ని మండల ప్రజా పాలన సేవా కేంద్రాలు, మున్సిపల్ కమిషనర్ కార్యాలయాలలోని ప్రజాపాలన సేవా కేంద్రాలలో దరఖాస్తు ఫారములను అందుబాటులో ఉంచాలన్నారు.
అదేవిధంగా ఇప్పటివరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అన్ని దరఖాస్తుల ప్రింట్ కాపీలు తీసి ఉంచాలన్నారు . రాజీవ్ యువవికాసం కింద స్వయం ఉపాధి పొందేందుకు ఏప్రిల్ 14 లోగా దరఖాస్తు చేసుకునే విధంగా అన్ని గ్రామాలు, మండల, మున్సిపల్ కేంద్రాలలో విస్తృత ప్రచారం చేయాలన్నారు, అలాగే టామ్ టామ్ వేయించాలన్నారు.
అధికారులందరు ఈ పథకంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి అమలు చేయాలని, క్షేత్ర స్థాయి వరకు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని, మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి పథకం విధి విధానాలను స్పష్టంగా తెలియజేయాలని చెప్పారు. రాజీవ్ యువ వికాస పథకాన్ని ప్రజలకు తెలిసే విధంగా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. యువత వారి కాళ్లపై వారు నిలబడి స్వయం ఉపాధి పొందెందుకు ఇది చక్కటి అవకాశం అని తెలిపారు. మంజూరి అనంతరం లబ్దిదారులకు దశలవారీగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.
అనంతరం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల పనులు నిబంధనలకు అనుగుణంగా నాణ్యతతో వేగవంతంగా నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ శోభారాణి,భువనగిరి రెవిన్యూ డివిజనల్ అధికారి కృష్ణా రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సునంద,జిల్లా శిశు సంక్షేమ అధికారి నరసింహ రావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్, హౌసింగ్ పి.డి విజయ సింగ్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీరాములు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.