27-03-2025 04:16:55 PM
కలెక్టర్ జితేష్ వి పాటిల్...
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బీసీ, ఎంబీసీ, బీసీ ఫెడరేషన్, (ఈబిసి, ఈ డబ్ల్యూ ఎస్) నిరుద్యోగులైన యువతీ, యువకులు రాజీవ్ యువ వికాసం అనే పథకానికి వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గురువారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకమునకు బీసీ, ఎంబీసీ(సంచార జాతుల వారు) బీసీ, ఫెడరేషన్ (రజక, నాయి బ్రాహ్మణ, వడ్డెర, బట్రాజు, కృష్ణ బలిజ/పూసల సగర/ఉప్పర, వాల్మీకి/బోయ, కుమ్మరి/శాలివాహన, విశ్వబ్రాహ్మణ, మేదర, కల్లుగీత కార్మికులు, గంగపుత్ర, పెరిక, పద్మశాలి, మేర, ముదిరాజ్, మున్నూరుకాపు, యాదవ, లింగాయత్) కులాలకు చెందిన వారు అర్హులని, రాజీవ్ యువ వికాసం ద్వారా యువతీ, యువకులు ఆర్థిక అభివృద్ధి, స్వయం ఉపాధిని పెంపొందించుకునే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని అందుకు ఈ కులాల వారు tgobmmsnow.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు.
ఈ పథకమునకు దరఖాస్తులు చేసుకొని అభ్యర్థుల వయస్సు 21 సంవత్సరంల నుండి 55 సంవత్సరంల వరకు (వ్యవసాయ సంబంధ వృత్తులకు 60 సంవత్సరములు) జులై 1 నుండి, 2025 నాటి వరకు) నిండి ఉండాలని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రము, ఆదాయ ధ్రువీకరణ పత్రము (గ్రామీణ ప్రాంతం వారికి రూ.1,50,000/లు, పట్టణ ప్రాంతం వారికి రూ.2,00,000/-లు ఉండాలని, ఒక కుటుంబంలో ఒకరు మాత్రమే అర్హులని, దివ్యాంగులకు సదరం ధ్రువీకరణ పత్రము జత పరచాలని, వ్యవసాయ ఆధారిత వృత్తులకు పట్టేదారు పాసుపుస్తకం జత చేయాలని, ట్రాన్స్పోర్ట్ సెక్టార్ (ఆటో, అప్పి ఆటో) వారు పర్మినెంట్ లైసెన్స్ జతపరచాలని, అలాగే దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు, కులం, ఆదాయ దృవీకరణ పత్రములు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పాన్ కార్డు జత చేసి వచ్చేనెల 5వ తారీఖు వరకు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు కొని, గ్రామీణ ప్రాంతం వారైతే మండల ప్రజాపరిషత్ అభివృద్ధి కార్యాలయంలోనూ, పట్టణ ప్రాంతం వారు అయితే మున్సిపాలిటీ కార్యాలయంలోనూ దరఖాస్తులను సమర్పించాలని అన్నారు.
ఈ పథకాల కింద సబ్సిడీ యూనిట్ విలువ 50 వేల యూనిట్కు 100% సబ్సిడీ ఉంటుందని, 50,001 నుండి లక్ష రూపాయల యూనిట్కు 90 శాతం సబ్సిడీ, 10% బ్యాంకు రుణము, 1,00,001 నుండి 2 లక్షల యూనిట్కు 80% సబ్సిడీ 20% బ్యాంకు రుణం 2,00,001 నుండి నాలుగు లక్షల యూనిట్కు 70% సబ్సిడీ 30% బ్యాంకు రుణం లభిస్తుందని, మైనర్ ఇరిగేషన్ యూనిట్కు 100% సబ్సిడీ ఉంటుందని ఆయన అన్నారు. కావున ఈ సదవకాశాన్ని నిరుద్యోగ వెనుకబడిన తరగతుల యువతి, యువకులు వినియోగించుకోవాలని ఆయన కోరారు.