కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు
రూ.2.15కోట్ల విలువచేసే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణి
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పేదవర్గాల సద్వినియోగం చేసుకొని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు లబ్దిదారులకు సూచించారు. కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని కొత్తగూడెం మున్సిపాలిటీ, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్ మండలాలకు చెందిన 215 మంది లబ్ధిదారులు రూ.2.15కోట్ల విలువచేసే కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ చెక్కులను, అదేవిధంగా 110 మంది లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ.40.50 లక్షల విలువచేసే చెక్కులను శుక్రవారం కొత్తగూడెం క్లబ్బులో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో అందజేశారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా కూనంనేని మాట్లాడుతూ.. కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకం ఆడబిడ్డలు ఉన్న పేద కుటుంబాలకు ఆసరాగా నిలుస్తోందని, ఆడపిల్లలకు వివాహం చేయడం భారంగా మారుతున్న ప్రస్తుత రోజుల్లో ఈ పథకం తల్లిదండ్రులకు ధైర్యాన్ని అందిస్తుందన్నారు.
ఎన్నికల వాగ్ధానం మేరకు తులం బంగారం పాత, కొత్త లబ్దిదారులకు అందించాలని డిమాండ్ చేశారు. అత్యవసర పరిస్థితిలో వైద్యం చేయించుకున్న తర్వాత అందించే సీఎం రిలీఫ్ ఫండ్ పరిమితిని ఎత్తివేసి పూర్తిస్థాయిలో చేసిన ఖర్చును అందించాలని కోరారు. కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తులో సాంకేతిక సమస్యల వల్ల చాలా జాప్యం జరుగుతోందని దీన్ని అధిగమించే చర్యలకు ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు, ఆస్పత్రి యాజమాన్యాలు పూనుకువాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో మధు, తహసీల్దార్లు పుల్లయ్య, కృష్ణ, ప్రసాద్, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, కమిషనర్ శేషాంజన్ స్వామి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎస్ కె సాబీర్ పాషా, సొసైటీ చైర్మన్ హన్మంతరావు, నాయకులు చంద్రగిరి శ్రీనివాసరావు, స్థానిక కౌన్సిలర్ ధర్మరాజు, పలువురు వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు.