calender_icon.png 22 January, 2025 | 9:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి..

22-01-2025 05:26:58 PM

అనిశెట్టిపల్లి గ్రామ సభలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్...

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్(District Collector Jitesh V. Patil) సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల సంక్షేమ పథకాల అమలులో భాగంగా నిర్వహించు గ్రామసభలలో రెండవ రోజు బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ లక్ష్మీదేవి పల్లి మండలం అనిశెట్టిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో పాల్గొన్నారు. గ్రామసభ తీరు, దరఖాస్తు ప్రక్రియను సమీక్షించారు. ఈ సందర్భంగా గ్రామ సభలో మండల ప్రత్యేక అధికారి, గ్రామపంచాయతీ సెక్రటరీ నాలుగు సంక్షేమ పథకాల అర్హుల జాబితాను సభకు చదివి వినిపించారు. అర్హుల జాబితాలో వచ్చిన అభ్యంతరాలను స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు గ్రామీణాభివృద్ధికి దోహదపడతాయి అన్నారు.

ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఈ గ్రామ సభలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. అర్హులకు జాబితాలో పేరు రానివారు ఆందోళన చేయాల్సిన అవసరం లేదని గ్రామ సభలలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కౌంటర్లలో దరఖాస్తులు సమర్పించాలని అన్నారు. గ్రామ సభల నిర్వహణ అర్హులను, అనర్హులను గుర్తించడానికి, అర్హులైన వారి నుండి దరఖాస్తులు స్వీకరించడానికి అని ఆయన తెలిపారు. దరఖాస్తుదారులు గ్రామ సభలలో కానీ ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజా పాలన సేవా కేంద్రాలలో  సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పీవీ చలపతిరావు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామపంచాయతీ సెక్రటరీ, సంబంధిత అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.