కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్...
మానకొండూర్ (విజయక్రాంతి): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Union Home Minister Bandi Sanjay Kumar) స్పష్టం చేశారు. మంగళవారం బెజ్జంకి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన వాణిజ్య సముదాయ భవనంతో పాటు ఫంక్షన్ హాల్‌ను ఆయనతో పాటు మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ(MLA Dr. Kavvampally Satyanarayana)తో కలిసి ప్రారంభించారు. బెజ్జంకి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షుడు తన్నీరు శరత్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ... వివిధ వర్గాల అభ్యున్నతి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయన్నారు. ఆయా పథకాల ద్వారా లబ్ధిపొందడమే కాకుండా వాటి సద్వినియోగం చేసుకోవాలని ఆయన ప్రజలను కోరారు.
రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(PM-Kisan Samman Nidhi) యోజన పథకాన్ని ప్రవేశపెట్టిందని, ఈ పధకం ద్వారా చిన్న, సన్నకారు రైతులందరికీ కనీస ఆదాయ మద్దతుగా ఏడాదికి రూ.6,000 అందజేస్తారన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజాసమస్యల పరిష్కారానికి పాటుపడుతున్నారు. జిల్లాలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులంతా కలిసికట్టుగా ఉండటం వల్లనే ప్రజాసమస్యల పరిష్కారానికి సమిష్టి కృషి చేస్తున్నామని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయ పార్టీల మధ్య పోటీ ఉంటుందని, ఎన్నికల తర్వాత ప్రజా సమస్యలపై అన్ని పార్టీలు ఏకమవుతాయన్నారు. వివిధ పార్టీల నాయకులతో కలిసి పనిచేసే విషయంలో తనకెలాంటి బేషజాలు లేవని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తేల్చి చెప్పారు.
సహకార సంఘాలు బలోపేతమైతేనే రైతులకు మేలు
ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను బలోపేతమైనప్పుడు రైతులకు మరింత మేలు జరుగుతుందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. సహకార సంఘాలను పటిష్టపర్చుకునేందుకు సంఘ సభ్యులంతా సమిష్టిగా కృషి చేయాలని ఆయన కోరారు. సహకార సంఘాలు ఆదాయ మార్గాలను ఎప్పటికప్పుడు అన్వేషిస్తూనే ముందుకు సాగాలన్నారు. ఆర్థికంగా బలోపేతమైనప్పుడే ఎదురయ్యే అవరోధాలను అధిగమించగలుగుతామని ఆయన పేర్కొన్నారు. సహకార సంఘాల నిధులను వెచ్చించడమే కాకుండా సంపద సృష్టిపైనా పాలకవర్గాలు దృష్టి సారించాలని సూచించారు. రైతుల అవసరాల మేరకు సహకార సంఘాలను విస్తరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఈ దిశగా సహకార సంఘాల పాలకవర్గాలు దృష్టి సారించాలని కోరారు. ఆదాయవనరులను సమకూర్చుకోవడంలో భాగంగా వాణిజ్య సముదాయాలతో పాటు ఫంక్షన్ హాల్ నిర్మించుకున్న సంఘ చైర్మన్ శరత్ రావును, సంఘ డైరెక్టర్లను అభినందించారు. ఈ సమావేశంలో శాసనమండలి సభ్యులు తాటిపర్తి భానుప్రసాద్ రావు, డీసీఎమ్మెస్ చైర్మన్ డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మాజీ చైర్మన్ దేవిశెట్టి శ్రీనివాస్ రావు, బెజ్జంకి మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ డైరెక్టర్ అలువాల కోటి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ ఒగ్గు దామోదర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, పార్టీ మండల కార్యనిర్వాహక అధ్యక్షుడు అక్కరవేణి పోచయ్య ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.