ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ ప్రారంభంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
సిరిసిల్ల (విజయక్రాంతి): గిరిజనులు ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు. గిరిజన సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో గిరిజన హక్కుల కోసం పోరాడిన ఉద్యమ నాయకుడు బిర్సా ముండా 150 జయంతి సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, బిర్సా ముండా చిత్రపటానికి పూల మాలలు వేసి, నివాళులు అర్పించారు. ధర్తి ఆబ జన జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ గిరిజన సంక్షేమం, సంకల్పం నుంచి సత్వర ఆచరణ దిశగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. గిరిజన హక్కుల కోసం పోరాడిన ఉద్యమ నాయకుడు బిర్సా ముండా అని కొనియాడారు.
దేశంలోని 63,843 గిరిజన గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రూ.79,156 కోట్లతో రానున్న ఐదేళ్లలో కనీస వసతులు కల్పించేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అధికారులు తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో గిరిజనుల ఆర్థిక అభివృద్ధి, వసతి, విద్యా, ఉపాధి కల్పన కోసం ఈ పథకాన్ని బిర్సా ముండా జయంతి సందర్భంగా ప్రారంభించిందని వెల్లడించారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు.
ప్రతిభ చూపిన విద్యార్థులకు అభినందన..
ఖేలో ఇండియా జాతీయస్థాయి సైక్లింగ్ పోటీల్లో గిరిజన విద్యార్థిని మలావత్ సౌందర్య బంగారు పతకం సాధించడంతో ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో పలు పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను అధికారులు అభినందించి, రానున్న రోజుల్లో కూడా అన్ని పోటీల్లో రాణించి జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ చూపాలని ఆకాంక్షించారు. ఇక్కడ డీ టీ డబ్ల్యూ ఓ జనార్ధన్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.