- ప్రధాన డోమ్ వద్ద నీటి లీకేజీ
- ఆవరణలోని తోటనూ ముంచెత్తిన వరద
ఆగ్రా, సెప్టెంబర్ 14: ప్రపంచ ఏడు వింతల్లో ఒకటిగా పేరొందిన తాజ్‌మహల్‌నూ వరద ప్రభావం వీడలేదు. యూపీలో ని ఆగ్రాలోని ఈ కట్టడం ప్రధాన డోమ్ వద్ద నీరు లీకవుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ౩ రోజులుగా ఆగ్రాలో భారీగా వర్షా లు పడుతుండడమే ఇందుకు కారణం. నీటి లీకేజీ వల్ల ఎలాంటి నష్టం లేదని అధికారులు స్పష్టంచేశారు. తాజ్‌మహల్ ఆవరణ లోని తోటను సైతం వరద ముంచెత్తింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఆగ్రాలో కురుస్తున్న వర్షాలతో తాజ్‌మహల్ ప్రధాన డోమ్ వద్ద నీరు లీకవుతుంది.
ఈ లీకేజీ వల్ల కట్టడానికి ఎలాంటి నష్టం లేదు’ అని పురావస్తు శాఖ పేర్కొంది. ఇదే విషయాన్ని ఆగ్రా సర్కిల్ చీఫ్ సూపరింటెండెంట్ రాజ్‌కుమార్ స్పష్టంచేశారు. 2017 మధ్యకాలంలో అత్యధిక మంది విదేశీయులు పర్యటించిన ప్రాంతంగా ఆగ్రా నిలిచినట్లు యూపీ పర్యాటకశాఖ అధికారిక డాటాలో పేర్కొంది. ఈ కాలంలో 1.51 కోట్ల మంది యూపీని సందర్శించగా అందులో 80.08 లక్షల మంది ఆగ్రా, 28 లక్షల మంది వారణాసిలో పర్యటించారు. కొవిడ్ టైమ్‌లో విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గినా తిరిగి పుంజుకుంది.