22-02-2025 12:01:55 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): గ్రేటర్‌లో రెండేళ్లకు పైగా ఆస్తి పన్ను చెల్లించని వ్యాపార సముదాయాలపై హెచ్‌ఎంసీ కొరడా ఝులిపించింది. ఈ క్రమంలో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13లోని బంజారా (పాత పేరు తాజ్‌బంజారా) హోటల్‌ను జీహెచ్‌ఎంసీ అధికారులు వారెంట్ నోటీసులిచ్చి సీజ్ చేశారు.
సీజ్ చేసిన మరుసటి రోజు ఉదయం పన్ను బకాయిలో సగం చెల్లించి, మిగతా సగం మార్చిలో చెల్లిస్తామని యాజమాన్యం కోరింది. దీంతో తిరిగి తాళాలు తెరిచారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని బంజారా హోటల్ రెండేళ్లుగా పైగా పన్ను చెల్లించకపోవడంతో రూ. 1.43 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి.
ఇప్పటికే పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ, ఎలాంటి స్పందన లేకపోవడంతో జీహెచ్‌ఎంసీ జూబ్లీహిల్స్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి, ఇతర అధికారులు గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వారెంట్ నోటీసు అందించి హోటల్‌ను సీజ్ చేశారు.
దీంతో ఒక్కసారిగా కంగుతున్న యాజమాన్యం గత్యంతరం లేని పరిస్థితిలో శుక్రవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో రూ.51.50 లక్షలు చెల్లించింది. మిగతా బకాయిను మార్చిలో చెల్లిస్తామని చెప్పడంతో అధికారులు హోటల్ సీజ్ ను తిరిగి ఓపెన్ చేశారు.