03-03-2025 06:58:19 PM
ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కంచర్ల జమలయ్య..
కొత్తగూడెం (విజయక్రాంతి): కార్పొరేట్ సంస్థలు, మాల్స్ ఏర్పాటుతో నష్టపోయి ఉపాధి కోల్పోతున్న టైలర్ వృత్తి దారులకు ప్రభుత్వం ఆర్ధికంగా ఆదుకోవాలని ఏఐటీయూసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కంచర్ల జమలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రామవరం పంజాబ్ గడ్డ సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జమలయ్య మాట్లాడుతూ... అనాదిగా టైలర్ వృత్తిపై ఆదారిపడి జీవిస్తున్న కుటుంబాలు రెడీమేడ్ వస్త్రాల ప్రవేశంతో ఉపాధి కోల్పోయి వారి కుటుంబాలు పస్తులు ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని, వీరిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
పాఠశాలలు, కళాశాలల, వసతి గృహాల విద్యార్థుల యూనిఫారంను టైలర్లకు అప్పగించి ప్రస్తుత ధరలకు అనుగుణంగా కూలి చెల్లించాలని, వీరు ఆర్ధికంగా స్థిరపడేందుకు సిఏం స్వయం సహాయక నిధి నుంచి ఒక్కో కుటుంబాలని రూ.5 లక్షల వడ్డీలేని ఋణం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ గృహాలు, ఇతర సంక్షేమ పథకాలు అందించి భరోసా కల్పించాలని కోరారు. సమావేశంలో టైలర్లు ఎన్ నాగేశ్వరరావు, రమేష్, కొండ శ్రీనివాస్, సురేష్, సాయి, స్నేహ, రమా, సోనీ, కావ్య, కమల తదితరులు పాల్గొన్నారు.