- 26/11 ముంబై ఉగ్రదాడుల్లో ప్రమేయం
- నేరగాళ్ల ఒప్పందం ప్రకారం రాణాను భారత్‌కు అప్పగించనున్న అమెరికా
న్యూఢిల్లీ, జనవరి 1: ముంబై ఉగ్ర దాడుల్లో ప్రమేయం ఉన్న పాకిస్థానీ సంతతికి చెందిన కెనడా వ్యాపారవేత్త తహవ్వూర్ రాణాను అమెరికా నుంచి భారత్‌కు తీసుకొచ్చే ప్రయత్నాల్లో కీలక ముందడుగు పడింది. రెండు దేశాల మధ్య ఉన్న నేరగాళ్ల ఒప్పందం ప్రకారం రాణాను భారత్‌కు అప్పగించాలని అమెరికాలోని దిగువ కోర్టులు కొద్ది రోజుల క్రితం తీర్పులు వెలువరించాయి.
అయితే కింది కోర్టులు ఇచ్చిన తీర్పును రాణా వ్యతిరేకించాడు. వాటి తీర్పును సవాలు చేస్తూ చివరి ప్రయత్నంగా శాన్ ఫ్రాన్సిస్కోలోని నార్త్ సర్క్యూట్ కోసం యూఎస్ కోర్టు ఆఫ్ అప్పీల్‌కు వెళ్లాడు. అయితే రాణా పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. అప్పగింత ఉత్తర్వులు సరైనవేనని పేర్కొంది. రాణాకు వ్యతిరేకంగా భారత్ తగిన సాక్ష్యాలు సమర్పించినట్టు వెల్లడించింది.
దీంతో రాణాను అమెరికా కొద్ది రోజుల్లోనే భారత్‌కు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చికాగోలో 2009లో రాణాను ఎఫ్‌బీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే 26/11 ముంబై దాడుల్లో రాణా కీలక పాత్ర పోషించాడు.
పాకిస్థాన్ లష్కరే తోయిబా ఉగ్రవాది డేవిడ్ కోల్‌మన్ హెడ్లీతో రాణాకు సంబంధాలు ఉన్నాయి. ముంబై దాడుల్లో 10 మంది ఉగ్రవాదులు 60 గంటలపాటు ముంబైలో నరమేధం సృష్టించి, 166 మంది ప్రాణాలను బలిగొన్న విషయం తెలిసిందే.