ఆర్టీసీ ఎక్స్‌రోడ్డు బావర్చీ హోటల్‌లో ఘటన
ప్రశ్నించిన కస్టమర్‌పై సిబ్బంది దురుసు ప్రవర్తన
ముషీరాబాద్, డిసెంబర్ 6: ఆర్టీసీ ఎక్స్‌రోడ్డులోని బావర్చీ హోటల్ బిర్యానీ రుచి చూసేందుకు శుక్రవారం ఆ హోటల్‌కు వచ్చిన ఓ భోజన ప్రియుడికి అనుకోని షాక్ తగిలింది. తాను ఆర్డర్ చేసిన చికెన్ బిర్యానీలో టాబ్లెట్ స్ట్రాప్ (మందుబిళ్లల అట్ట) ప్రత్యక్షమవ్వడంతో అతడు ఖంగుతిన్నాడు. ఈ విషయమై హోటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించడంతో పాటు వీడియో తీస్తున్న సదరు కస్టమర్‌పై హోటల్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు.
వీడియో ఎందుకు తీస్తున్నావ్ వెంటనే ఆఫ్‌చెయ్ అని అతడిని బెదిరించారు. కాగా ఇదే హోటల్‌లో బిర్యానీలో ఇటీవల సిగరేట్ పీకలు, బల్లి ప్రత్యక్షం అయిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఫుడ్ సేప్టీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.