calender_icon.png 10 January, 2025 | 10:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీ20 ప్రపంచకప్ టూ ఒలింపిక్స్ దాకా

01-01-2025 12:00:00 AM

  1. ముగిసిన 2024 ఏడాది
  2. పుష్కరకాలం తర్వాత ఐసీసీ ట్రోఫీ నెగ్గిన టీమిండియా
  3. ఒలింపిక్స్‌లో మనూ బాకర్, నీరజ్ జోరు
  4. చెస్‌లో మెరిసిన భారత ఆణిముత్యాలు

న్యూఢిల్లీ: కాలక్రమంలో మరో ఏడాది కనుమరుగయ్యింది. 2024 ఏడాది క్రీడల్లో కొన్ని మధురానుభూతులు అందించగా.. మరికొన్ని చేదు జ్ఞపకాలను మిగిల్చింది. కొంత మోదం.. మరికొంత ఖేదం అన్నట్లుగా సాగింది ఈ ఏడాది. ముందుగా జూన్‌లో వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా విజేతగా నిలిచింది.

ఈ ఫార్మాట్‌లో 17 ఏళ్ల తర్వాత రెండోసారి చాంపియన్‌గా నిలవగా.. పుష్కరకాలం తర్వాత ఐసీసీ ట్రోఫీ నెగ్గింది. దేశానికి ప్రపంచకప్‌తో తిరిగొచ్చిన భారత జట్టుకు అపూర్వ స్వాగతం లభించింది. ముంబై వీధుల గుండా టీమిండియా ప్రఖ్యాత వాంఖడే స్టేడియానికి చేరుకోగా ఇసుక వేస్తే రాలనంత జనం రావడం విశేషం.

వినేశ్‌పై అనర్హత వేటు

భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అనర్హత వేటు యావత్ దేశాన్ని షాక్‌కు గురిచేసింది. ఒలింపిక్స్‌లో 50 కేజీల విభాగం ఫైనల్ పోరుకు ముందు వినేశ్ 100 గ్రాముల అధిక బరువు కారణంగా త్రుటిలో పతకాన్ని చేజార్చుకుంది. కనీసం రజతమైనా ఇవ్వాలంటూ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌కు మొరపెట్టుకున్నప్పటికీ లాభం లేకపోయింది.

ఈ సంఘటన తర్వాత వినేశ్ ఫొగాట్ రెజ్లింగ్‌కు వీడ్కోలు పలికింది. ఇక పారాలింపిక్స్‌లో మన అథ్లెట్లు మరోసారి మెరిశారు. మొత్తం 29 పతకాలు సాధించిన భారత్ పట్టికలో 18వ స్థానంలో నిలిచింది.

భారత్ మెడలో చెస్ కిరీటం

ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత్ ఆణిముత్యాలు చరిత్ర సృష్టించారు. భారత మహిళలు, పురుషుల బృందం ఏకకాలంలో పసిడి పతకాలు నెగ్గడం విశేషం. ఇక వ్యక్తిగత విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్లు అర్జున్ ఇరిగేసి, గుకేశ్ దొమ్మరాజు స్వర్ణ పతకాలు సాధించారు.

నవంబర్‌లో జరిగిన ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ గుకేశ్.. చైనా గ్రాండ్‌మాస్టర్ డింగ్ లిరెన్‌ను ఓడించి 18 ఏళ్లకే చాంపియన్‌గా నిలిచి అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయుడిగా రికార్డులకెక్కాడు. ఇక టెన్నిస్ దిగ్గజం రఫేల్ నాదల్ అంతర్జాతీయ టెన్నిస్‌కు గుడ్ బై పలికాడు.

ఒలింపిక్స్‌లో భారతీయం

టీ20 ప్రపంచకప్ ముగిసిన నెల రోజుల వ్యవధిలో ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్ క్రీడలు మొదలయ్యాయి. ఎన్నో ఆశలతో పారిస్‌లో అడుగుపెట్టిన మన అథ్లెట్లు కేవలం ఆరు పతకాలతో సరిపెట్టారు. ఈసారి స్వర్ణం లేనప్పటికీ భారత స్టార్ నీరజ్ చోప్రా సాధించిన రజతం పసిడితో సమానంగా నిలిచింది.

ఇక మనూ బాకర్ రెండు కాంస్యాలతో మెరిసి ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన షూటర్‌గా రికార్డులకెక్కింది. వీరితో పాటు షూటర్లు సరబ్‌జోత్ సింగ్, స్వప్నిల్ కుసాలే కాంస్యం నెగ్గగా.. పురుషుల హాకీ జట్టు వరుసగా రెండోసారి కాంస్యంతో మెరిసి చరిత్ర సృష్టించింది. రెజ్లింగ్‌లో అమన్ షెరావత్ కాంస్యం ఒడిసిపట్టాడు.