- ప్రశంసించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
- తెలంగాణతో 117 సంస్థల ఒప్పందాలు
హైదరాబాద్, నవంబర్ 30 (విజయ క్రాంతి): ఆవిష్కర్తలతో పెట్టుబడిదారులను కలపడంలో టీ-కన్సల్ట్ పాత్ర కీలకమని ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నా రు. శనివారం హైదరాబాద్‌లోని టీ-హబ్ వేదికగా టీ-కన్సల్ట్ కొలాబొరేషన్ కాంక్లేవ్- 2024ను మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు.
ఈ సమావేశంలో వివిధ రంగాల్లో ఆవిష్కరణలు, అభివృద్ధికి నూతన మార్గాలు చూపించే 117 సంస్థలతో ఒప్పందాలు కుదిరాయి. దీని కోసం కృషి చేసిన టీ-కన్సల్ట్ వ్యవస్థాపకుడు సందీప్‌కుమార్ మక్తాలాను శ్రీధర్‌బాబు ప్రశంసించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమావేశంలో కుదిరిన ఒప్పందాలు ఆర్థికాభివృద్ధిలో కీలకమైన అడుగు అని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ఆవిష్కరణల్లో, పారిశ్రామిక అభివృద్ధిలో ముం దంజలో నిలిపే ప్రయత్నాల్లో ఈ ఒప్పందాలు ప్రధాన భాగమవుతాయన్నారు. సదస్సులో అన్‌ట్యాప్డ్ ఇన్‌వెస్టర్ ప్రోగ్రాం, టీ- కన్సల్ట్ హెల్త్, డాక్టర్స్ పూల్, టాలెంట్ కనెక్ట్, ఎంఎస్‌ఎంఈ పాలసీపై చర్చల వల్ల నూతన ఆవిష్కర్తలు, పెట్టుబడిదారులతో సంప్రదింపులు జరిపే అవకాశం ఏర్పడిందని చెప్పారు.
ఐటీ రంగంలో పనిచేస్తున్న ప్రతిభావంతులను 63 దేశాల్లోని సంస్థలతో అనుసం ధానం చేయడం గొప్ప కార్యక్రమమని ప్రశంసించారు. ఉద్యోగులను కంపెనీలతో కలపడం, ఐటీ ఉద్యోగులను ఇతర దేశాల్లో అదే రంగంలో ఉన్న ఉద్యోగులతో కనెక్ట్ చేయడం ఈ సదస్సు వల్ల సాధ్యమైందన్నారు. రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పించడంలో టీ- కన్సల్ట్ సదస్సు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.
మలేషియా, ఆస్ట్రేలియాలతో విద్యార్థుల మార్పిడి కార్యక్రమాన్ని కూడా ఈ సంస్థ చేపట్టే ప్రయత్నాల్లో ఉందని తెలిపారు. సందీప్‌కుమార్ మక్తాలా మాట్లాడుతూ పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు, పాలసీ మేకర్లను కలిపి భవిష్యత్‌ను తీర్చిదిద్దే భాగస్వామ్యాలను సృష్టించడమే తమ లక్ష్యమ న్నారు. ఈ సందర్భంగా పలువురికి బీఐసీసీ ఐ వ్యవస్థాపక అవార్డులు అందజేశారు.