సిరియాలో అంతర్యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోంది. 2011లో అస్సాద్ పాలనకు వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం చివరికి తుర్కియే ( టర్కీ) దన్నుతో తిరుగుబాటుదారులు, జిహాద్ ఉగ్రవాదులు, సిరియా వ్యతిరేక శక్తుల సమూహంగా కొత్త రూపు సంతరించుకుని ఇటీవలి కాలంలో ఉధృతమయింది. ఈ అంతర్యుద్ధం కారణంగా లక్షలాది మంది శరణార్థులుగా ఇతర దేశాలకు వెళ్లారు. సగం జనాభా తమ స్వస్థలాలను వదిలి దేశంలోని ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.
తిరుగుబాటుదారులు దేశంలోని ప్రధాన నగరాలను ఒక్కటొక్కటిగా ఆక్రమించుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం దేశంలో రెండో అతిపెద్ద నగరమయిన అలెప్పోను తమ అధీనంలోకి తీసుకున్న తిరుగుబాటుదారులు తాజాగా హమా నగరాన్ని కూడా తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. మూడు రోజుల పాటు ప్రభుత్వ సేనలతో పోరాడిన తిరుగుబాటుదారులు బుధవారం నగరాన్ని ఆక్రమించుకున్నారు.
నగరంలోని పోలీసు కమాండ్ ప్రధాన కార్యాలయం, వైమానిక స్థావరం, కేంద్ర కారాగారంపై పట్టు సాధించారు. జైల్లో ఉన్న వందలాది మంది ఖైదీలను బైటికి వదిలేశారు. తిరుగుబాటుదారులు నగరం మధ్యలోకి వచ్చేయడంతో ఘర్షణలతో అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోవడం ఇష్టం లేక తామే నగరాన్ని వదిలేసి వచ్చినట్లు సైన్యం ప్రకటించడం గమనార్హం. ఇప్పుడు తిరుగుబాటుదారులు దేశంలో మూడో పెద్ద నగరమైన హోమ్స్ సిటీపై గురిపెట్టారు.
హమా నగరానికి 40 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న హోమ్స్‌కు దేశ రాజధాని డమాస్కస్ సింహద్వారంగా పేరుంది. తాజా పరిణామం డమాస్కస్‌నుంచి పాలన సాగిస్తున్న అస్సాద్‌కు మింగుడుపడని వ్యవహారమేనని, ఎందుకంటే హమాపై పట్టుకోల్పోయారంటే అస్సాద్ త్వరలోనే దేశంపై పట్టు కోల్పోతారని అర్థమని బ్రిటన్ కేంద్రంగా పని చేస్తున్న సిరియా మానవ హక్కుల సంస్థ ‘వార్ మానిటర్’ చీఫ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అస్సాద్ ప్రభుత్వ పాలన నీడలో కొన్ని నగరాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మిగతా ప్రాంతాలను తిరుగుబాటుదారులు గత కొన్ని నెలలుగా ఆక్రమించుకుంటూ వస్తున్నారు.
ఇంతకాలం అస్సాద్‌కు అన్నిరకాల అండదండలు అందించిన రష్యా, ఇరాన్‌లు ఇప్పుడు సొంత యుద్ధాలతో తలమునకలుగా ఉన్నాయి. మిత్ర దేశమైన సిరియాకు సైనిక, ఆర్థిక సాయం చేసేంత తీరుబాటు వాటికి లేదు. ఉక్రెయిన్‌తో రష్యా, ఇజ్రాయెల్‌తో ఇరాన్ యుద్ధంలో మునిగి ఉన్న విషయం తెలిసిందే. ఇన్నాళ్లు ఈ రెండు దేశాల అండతోనే అస్సాద్ తిరుగుబాటుదారులను అణచివేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ రెండు దేశాల సాయం ఆయనకు లభించడం లేదు.
దీన్ని అవకాశంగా తీసుకున్న తిరుగుబాటుదారులు తమ ఆక్రమణల వేగం పెంచారు. సైన్యంలో అస్సాద్‌ను వ్యతిరేకించే వర్గం కూడా వీరితో చేతులు కలిపింది. వీరంతా వేర్వేరు తిరుగుబాటు దళాలుగా ఉన్నప్పటికీ అస్సాద్‌ను తొలగించి ప్రస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే ఉమ్మడి లక్ష్యంగా పని చేస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం 2011మార్చినుంచి 2021 మార్చివరకు పదేళ్ల కాలంలో సిరియాలో అంతర్యుద్ధం కారణంగా 3.5 లక్షలమంది చనిపోయారు.
ఇంకా లెక్కకు రాని మరణాలు చాలానే ఉన్నాయి. వీరిలో దాదాపు సగం మంది సామాన్య పౌరులు. మృతుల్లో మూడింట రెండు వంతుల మంది సైన్యం చేతిలో హతమైన వారయితే మిగతా వారిని తిరుగుబాటుదారులు చంపేశారు. 25 కోట్ల దేశ జనాభాలో సగం మంది ఇతర దేశాలకు వలస పోయారు. దాదాపు 20 లక్షలమంది శరణార్థి శిబిరాల్లో కనీస సదుపాయాలకు దూరమై దుర్భర జీవితం గడుపుతున్నారు. ఇంతటి రక్తపాతం కళ్లముందు కనబడుతున్నా మరోసారి అంతర్యుద్ధానికి పరిస్థితులు దారి తీస్తున్నాయంటే అస్సాద్ పాలనపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతే కారణం. అస్సాద్‌నుంచి విముక్తి పొందడానికి సిరియాకు ఎక్కువ రోజులు పట్టకపోవచ్చనేది పరిశీలకుల అంచనా. ఆ తర్వాత ప్రజలు కోరుకున్నట్లుగా ప్రజాప్రభుత్వం ఏర్పడుతుందా లేక పశ్చిమ దేశాల కీలుబొమ్మ సర్కార్ గద్దెనెక్కుతుందా అనేదే ప్రశ్న.