calender_icon.png 17 January, 2025 | 1:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంతానం పట్ల సమదృష్టి

09-08-2024 12:00:00 AM

సంతానం పట్ల సమదృష్టిరుద్రుని కింకరులలో భేతాళుడు ఒకరు. సుప్రసిద్ధ ‘భేతాళ కథలు’ అనేకం మనం ‘చందమామ’ పిల్లల పత్రికలో చదివాం. ఆశ్చర్యంగా ‘భవిష్య పురాణం’లో భాగంగా ‘భేతాళుడు - విక్రమాదిత్యుల సంభాషణలు’ మనకు కనిపిస్తాయి. వాటిలో ఈ ఆధునిక కాలానికి పనికి వచ్చే నిజ జీవిత సూత్రాలు కొన్ని లేకపోలేదు. 

భేతాళుని ఈ కథ సంతానం పట్ల మనుషులు చూపించవలసిన సమదృష్టిని తెలియజేస్తుంది. పూర్వకాలంలో రూపదత్తుడనే యువరాజు వేటకు వెళ్లాడు. ఒక సరోవరం వద్ద తన సఖితోపాటు కమల పుష్పాలను సేకరిస్తున్న ఒక అందమైన మునికన్యను చూశాడు. ఆమె శ్రేష్ఠమైన రూపాన్నికి ముగ్ధుడయ్యాడు. ఆ కన్య కూడా రాజును చూసి ప్రసన్నురాలైంది. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమలో పడ్డారు. అదే సమయంలో ఆ మునికన్య తండ్రి అక్కడికి వచ్చాడు. రూపదత్తుడు తన మనోభీష్టాన్ని తెలుపడంతో, ఆ ముని వారి వివాహం జరిపిస్తాడు.

ఆ దంపతులు తమ రాజధానికి బయలుదేరి మధ్య దారిలో ఒక వటవృక్షం కింద విశ్రమిస్తారు. ఆ మహావృక్షాన్ని ఆశ్రయంగా చేసుకొన్న ఒక బ్రహ్మరాక్షసుడు వాళ్లను సంహరించడానికి సిద్ధపడతాడు. రూపదత్తుడు తమను విడిచిపెట్టమని ప్రాధేయపడడంతో, ఆ బ్రహ్మరాక్షసుడు ఇలా అన్నాడు. “ఓయీ రాజకుమారా! నువు ఏడు సంవత్సరాల బ్రాహ్మణ బాలుణ్ణి నాకు తెచ్చిస్తే మిమ్మల్ని వదిలేస్తాను.” “సరే” అని రూపదత్తుడు రాక్షసునికి మాట ఇచ్చి, రాజధానికి వెళతాడు. ఒక లక్ష బంగరు నాణేలతో ఒక బ్రాహ్మణ మధ్యమ బాలుణ్ణి కొనుగోలు చేసి రాక్షసునికి అప్పగిస్తాడు. మొదట ఆ బాలుడు నవ్వి, పిదప ఏడ్వడం మొదలుపెట్టాడు.

బేతాలుడు కథ ముగించేసి అడుగుతాడు, “రాజా! ఆ బాలుడు ముందు నవ్వటానికి, పిదప ఏడ్వటానికి గల కారణమేమిటి?” విక్రమాదిత్యుడిలా చెప్పాడు. “సాధారణంగా జ్యేష్ఠ పుత్రుడు తండ్రికి, కనిష్ఠ పుత్రుడు తల్లికి ప్రియమైన వారై ఉంటారు. ఆ బాలకుడు మధ్యముడు కదా! ఎవరి బాంధవ్యమూ లేక, అమ్మకానికి లోనయ్యాడు. ఇది జ్ఞప్తికి తెచ్చుకున్న ఆ బాలకునికి ముందు నవ్వు వచ్చింది. ఆ తర్వాత రాక్షసునికి ఆహారమవుతున్నందుకు ఏడ్పు వచ్చింది”. తల్లిదండ్రులు తమ సంతానం పట్ల సమదృష్టిని కలిగి ఉండాలన్నది ఇందులోని జీవన సూత్రం.

- యంవీ నరసింహారెడ్డి