calender_icon.png 23 October, 2024 | 2:59 PM

పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరుకు సై !

09-08-2024 12:57:58 AM

  1. పోటాపోటీగా ఆశావహుల ప్రయత్నాలు 
  2. సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మళ్లీ ‘కాంగ్రెస్’ను టికెట్ అడిగే అవకాశం 
  3. మరో అభ్యర్థిని పార్టీ బరిలో దింపే అవకాశం ? 
  4. బీఆర్‌ఎస్ నుంచి ప్రచారంలో వినోద్.. మరికొందరి పేర్లు 
  5. బీజేపీ నుంచి ఇద్దరి పేర్లు..

కరీంనగర్, ఆగస్టు 8 (విజయక్రాంతి): కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా టి.జీవన్‌రెడ్డి పదవీ కాలం 29 మార్చి 2025తో ముగియనున్నది. సెప్టెంబర్‌లో పట్టభద్రుల ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. దీంతో ఆ సీటును దక్కిం చుకునేందుకు ప్రధాన పార్టీలకు చెందిన ఆశావహులంతా ఇప్పటి నుంచే ప్రయత్నా లు ప్రారంభించారు. ఈ పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో నిజామాబాద్, ఆదిలా బాద్, మెదక్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి. 2019లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఎవరినీ బరిలోకి దించలేదు.

కానీ బరిలో నిలిచిన రవాణాశాఖ అధికారి చ్రందశేఖర్ గౌడ్‌కు బయట నుంచి బీఆర్‌ఎ స్ మద్దతు ప్రకటించింది. కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు టికెట్ కోసం పోటీ పడినప్పటికీ పార్టీ తరఫున ఎవరినీ బరిలో ఉంచలేదు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్‌రెడ్డి గెలిచారు. ఇటీవల జరిగిన వరంగల్ పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలవడంతో బీఆర్‌ఎస్ కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గంపై దృష్టి సారించింది. బీఆర్‌ఎస్ నుంచి లోక్‌సభ ఎనినకల్లో పోటీ చేసి ఓడిన బోయినపల్లి వినోద్‌కుమార్ పేరు ప్రచారంలో ఉంది.

గత ఎన్నికల్లో ప్రయత్నం చేసిన పార్టీ నేతలు సర్దార్ రవీందర్‌సింగ్, యాదగరి శేఖర్‌రావుతోపాటు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, రుసో విద్యాసంస్థల చైర్మన్, కోహెడ పీఏసీఎస్ చైర్మన్ పేరాల దేవేందర్‌రావు పేర్లూ వినిపిస్తున్నాయి. రవీందర్‌సింగ్ ఇటీవల తన పుట్టిన రోజు సందర్భంగా బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిసి తననకు ఎమ్మెల్సీ గా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. 

కాంగ్రెస్ నుంచి బలంగా ఇద్దరి పేర్లు..

బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఆర్. సత్యనారాయణ కూడా ఆశావహుల్లో ఉన్న ట్లు ప్రచారం జరుగుతోంది. బీసీ అభ్యర్థి కావడంతో కాంగ్రెస్ నుంచి ఆయన్ను బరి లో దించే ఆలోచనలో ఉన్నట్లు  తెలిసింది. 

ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా మళ్లీ తనకే అవకాశం ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరే అవకాశం ఉంది. ఇటీవల జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంలో జీవన్‌రెడ్డి అలక వహించగా అధిష్టానం ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని చెప్పినట్లు తెలిసింది. ఆయన్ను పట్టభద్రుల ఎమ్మెల్సీగా బరిలో ఉంచుతారా? లేక ఎమ్మెల్యేల కోటా నుంచి ఎమెల్సీ అభ్యర్థిగా బరిలో ఉంచుతారా..? అన్నది చూడాలి. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ నుంచి ఆర్.సత్యనారాయణ, జీవన్‌రెడ్డి పేర్లు మాత్రమే తెరమీద ఉన్నాయి. ఎన్నికల సమయానికి మరికొందరి పేర్లు తెరమీదకు వచ్చే అవకాశం ఉంది. 

బీజేపీ నుంచి ఆశావహులు వీరే..

బీజేపీ కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను ప్రతిష్ఠ్మాకంగా తీసుకోనున్నది. గత ఎన్నికల్లో పి.సుగుణాకర్‌రావు పార్టీ తరఫున బరిలో నిలిచి ఓటమి చవిచూశారు. ఈసారి కూడా ఆయన పార్టీ తరఫున బరిలోకి దిగేందుకు తన ప్రయత్నాలు ప్రారంభించారు. శాసనసభ ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, ఓటమిపాలైన రాణి రుద్రమ పేరు కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఆమెకు కేంద్ర మంత్రి బండి సం జయ్ ఆశీస్సులు ఉన్నట్లు ప్రచా రం జరుగుతోంది. మొత్తానికి ఈ సారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో త్రిముఖ పోటీ తప్పేట్టు లేదు. 

ఉపాధ్యాయుల నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి..

కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక కూడా పట్టభద్రుల ఎన్నికతో కలిపి జరగనున్నది. ప్రస్తుతం ఉపాధ్యా య ఎమ్మెల్సీగా పీఆర్టీయూ నేత రఘోత్తంరెడ్డి కొనసాగుతున్నారు. ఈసారి ఆయన స్థానంలో ఆ సంఘం అభ్యర్థిని మార్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఉపాధ్యాయ నియోజకవర్గంపై దృష్టి సారించింది. టీచర్ ఎమ్మెల్సీగా సీపీఎస్ రద్దు కోసం నిర్వహించిన పోరాటంలో కీలకపాత్ర వహించిన కృష్ణారావు బరిలో దిగనున్న ట్లు తెలుస్తుంది. ఎన్నిక నాటికి మరికొందరి పేర్లు తెరమీదకు వచ్చే అవకాశం ఉంది.