calender_icon.png 18 January, 2025 | 10:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాల స్వరూపుడు శ్యామలమూర్తి

19-12-2024 12:00:00 AM

ఆళి= సముద్రంల వలె గంభీర స్వభావం గల, మళైక్కణ్ణా= వర్షాలకు అధిపతియైన వరుణదేవా, నీ ఒన్రు= నీవు ఇసుమంతైనా, నీ= నీవు, కై కరవేల్= దాచుకోవద్దు, ఆళియుళ్= సముద్రం లోపల, పుక్కు= చొరబడి, ముగున్దు కొడు= అక్కడున్న నీటిని, ఆర్తు= మేఘ గర్జనలు చేస్తూ, ఏఱి= ఆకాశంలో వ్యాపించి, ఊళిముదల్వన్= కాలము వంటి అనేక చరాచర పదార్థాలకు కారణభూతుడైన నారాయణుని, ఉరువమ్పోల్= శరీరం వలె, మెయి కరుత్తు= శ్యామవర్ణ శరీరంగా, పాళియందోళుడైయ= మహనీయమూ, మనోహరమూ అయిన భుజస్కందాలు కలిగినవాడు, పర్పనాబన్ కైయిల్= పద్మనాభుని దక్షిణ హస్తమందున్న, ఆళిపోళ్ మిన్న= చక్రాయు ధం వలె మెరుపులు మెరిపించి, వలమ్బురి పోల్= దక్షిణావర్త శంఖమైన పాంచజన్యం వలె, నిన్రదిరిన్దు= స్థిరంగా నిలిచి ఘోషించి, తాళాదే = ఆలస్యం చేయకుండా, శార్‌జ్ఞ = పరమాత్ముడి విల్లైన శాజ్ఞ ్గమ్, ముదైత్త శరమళైపోల్= వేగంగా కురిపించి బాణముల వర్షం వలె, వాళవులగినిల్= విశ్వంలోని సక ల జీవరాశి జీవించడానికి, నాంగళుమ్= వ్ర తాన్ని ఆచరించే మేమూ, మగిళిన్దు= సంతోషంతో, మార్గళి నీరాడ= మార్గళి స్నానానికి, పెయ్ దిడాయ్= వర్షాన్ని కురిపించాలి.

మేఘం స్వభావం గంభీరం, వర్షానికి వాహకుడు మేఘుడు. పర్జన్య దేవుడు. ఆ మేఘానికి ఈ పాశురం ద్వారా ప్రార్థన చేస్తున్నది. “ఓ మేఘమా! నీవు దాతృత్వంలో చూపే ఔదార్యాన్ని ఏమాత్రమూ తగ్గించరాదు. గంభీరమైన సముద్రంలో మధ్యకు వెళ్లి, ఆ సముద్ర జలాన్ని తాగి, గర్జించి, ఆకాశమంతటా వ్యాపించి, సర్వజగత్కారణ భూతుడైన శ్రీమన్నారాయణుని నీలమేఘ విగ్రహం వలె శ్యామలమూర్తియై, ఆ పద్మనాభుని విశాల సుందర బాహుయుగళిలో దక్షిణ బాహువునందలి చక్రంవలె మెరసి, ఎడమ చేతిలోని శంఖం వలె ఉరిమి, శార్జ్ మనే ధనుస్సు విడిచే బాణముల ములుకుల వర్షం వలె వర్షించు. లోకమంతా సుభిక్షంగా ఉండేట్టు మేమంతా సంతోషంతో మార్గశీర్ష స్నానం చేసేట్టుగా వర్షాన్ని కురిపించు.

అన్నమయ్య “చక్రమా హరిచక్రమా, వక్రమైన దనుజుల వక్కలించవో’ అంటూ చుట్టి చుట్టి పాతాళము చొచ్చి హిరణ్యాక్షుని చట్టలు చీరిన వో చక్రమా! పట్టిన శ్రీహరిచేత బాయ క యీజగములు వొట్టుకొని కావగదవో వోచక్రమా” అని కీర్తనలో వివరిస్తున్నాడు. 

గోపికల వ్రతానికి కారణం స్వార్థం కాదు, వారి లక్ష్యం దేశం క్షేమమే. తమ వ్రతంతో లోకమంతటా పాడిపంటలు సమృద్ధిగా ఉం డాలన్నదే వారి కోరిక. ఈ వ్రతానికి స్నానమే ప్రధానం. దీనిని ‘స్నాన వ్రతం’ అనీ అంటా రు. వారి స్నానానికి జలం సమృద్ధిగా ఉండా లి. గోపికలు కృష్ణ భగవానుడే ‘ఉపాయము, ఆయనే ఫలము’ అని నిశ్చయించుకొన్నారు. ఇతరములైన ఏ ఫలితాలను వారు ఆశ్రయింపరు. వారిది అనన్య భక్తి.

భగవంతుడు సర్వేశ్వరుడు. ఆయనే అందరినీ వివిధ అధికారాలలో నియమించారు. బ్రహ్మను సృష్టి కార్యానికి, శివుడిని లయకార్యానికి, అష్టదిక్పాలకులను తదితర కార్యాల కు నియుక్తులను చేశారు. సర్వేశ్వరుని ఆశ్రయి స్తే ఆ భగవానుడు నియమించిన దేవతలందరూ భక్తులను అనుసరిస్తారు. ఒకసారి కూరత్తాళ్వార్‌ను “అన్యదేవతలను చూసినపుడు మీరు ఏ విధంగా ప్రవర్తిస్తారు?” అని అడిగితే, “మీరు శాస్త్ర విరుద్ధంగా అడుగుతున్నారు. మిమ్మల్ని చూసి అన్యదేవతలు ఏ విధంగా ప్రవర్తిస్తారు అని అడగాలి” అని సమాధానం చెప్పారట. పరమాత్మను ఆశ్రయించిన వారివద్ద, భగవానునివద్ద వినయ విధేయతలతో మెలిగినట్లు దేవతలందరూ కూడా వారికి ఆజ్ఞావశవర్తులై ఉంటారట.