న్యూఢిల్లీ, నవంబర్ 10: ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ నిర్వహిస్తున్న స్విగ్గీ నవంబర్ 13న స్టాక్ ఎక్సేంజ్‌ల్లో లిస్ట్ అవుతుంది. రూ.11,327 కోట్ల సమీకరణకు గతవారం జారీఅయిన స్విగ్గీ ఐపీవో 3.6 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయ్యింది. అయితే ఈ పబ్లిక్ ఆఫర్‌కు రిటైల్ ఇన్వెస్టర్ల స్పందన అంతంతమాత్రంగానే లభించింది.
రిటైల్ విభాగంలో 1.14 రెట్లు మాత్రమే సబ్‌స్క్రిప్షన్ లభించింది. స్విగ్గీతో పాటు సోలార్ విద్యుదుత్పాక కంపెనీ ఏసీఎంఈ సోలార్ హోల్డింగ్స్ కూడా నవంబర్ 13నే లిస్టవుతుంది. గతవారం ఐపీవోకు వచ్చిన ఏసీఎంఈ సోలార్ హోల్డింగ్స్ 2.75 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ను పొందింది. నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ షేర్లు నవంబర్ 14న ఎక్సేంజీల్లో లిస్టవుతాయి. స్టాక్ మార్కెట్ ప్రస్తుతం బలహీనంగా ట్రేడవుతున్న నేపథ్యంలో ఈ మూడు కంపెనీల షేర్లూ గ్రే మార్కెట్లో పెద్ద ప్రీమియంతో ట్రేడ్‌కావడం లేదని మార్కెట్ పరిశీలకులు తెలిపారు.