calender_icon.png 22 October, 2024 | 10:04 AM

హాస్టల్ విద్యార్థులకు తీపికబురు

22-10-2024 01:46:52 AM

  1. డైట్, కాస్మోటిక్ చార్జీల పెంపు
  2. 40శాతం పెంపునకు ప్రతిపాదనలు
  3. 7.65లక్షల మందికి ప్రయోజనం 
  4. డిప్యూటీ సీఎం భట్టికి నివేదిక అందజేత 

హైదరాబాద్, అక్టోబర్ 21(విజయక్రాంతి): రాష్ట్రంలోని రెసిడెన్షియల్, సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు 40శాతం వరకు డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంచాలని ప్రభుత్వానికి ఉన్నతాధికారుల కమిటీ నివేదించింది. ఈ మేరకు ఆ ప్రతిపాదల నివేదికను సోమవారం సచివాల యంలో డిప్యూటీ సీఎం భట్టికి అందజేసింది.

గత 16ఏళ్లుగా కాస్మోటిక్, గత ఏడేళ్లుగా డైట్ చార్జీలను ప్రభుత్వాలు పెంచలేదు. దీంతో రెసిడెన్షియల్, సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు  డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంచాలని మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం విజ్ఞప్తితో ప్రతిపాదనలను సిద్ధం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఒక ఉన్నతాధికారుల కమిటీని నియమించారు.

బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం నేతృత్వంలోని ఈ బృందం.. కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తున్న నవోదయ విద్యాలయాల్లో అధ్యయనం చేశారు. అలాగే గత ఏడేళ్లుగా మార్కెట్లో నిత్యావసరాల ధరలు ఎలా ఉన్నాయి? ద్రవ్యోల్బణం వంటి అంశాలను పరిశీలించారు. అంతేకాకుండా గతేడాది మార్చి 1వ తేదీన కాస్మోటిక్ చార్జీల పెంపుపై సబ్ కమిటీ ఇచ్చిన నివేదికను కూడా పరిశీలించారు.

2022 ఫిబ్రవరిలో మహిళా శిశు సంక్షేమ శాఖ దివ్యాంగుల వసతి గృహాల్లో పెంచిన డైట్ చార్జీలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. అన్ని కోణాల్లో పరిశీలించిన ఉన్నతాధికారుల కమిటీ అదనంగా 40శాతం వరకు డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంచాలని  ప్రభుత్వానికి సూచించింది. ఈ చార్జీల పెంపు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 7.65లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.

ఉన్నతాధికారుల కమిటీలో ఉన్నది వీరే

బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం నేతృత్వంలోని ఈ కమిటీలో ఎస్సీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, ట్రైబల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ శరత్, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్సీ వెల్ఫేర్ కమిషనర్ శ్రీదేవి, మైనార్టీ వెల్ఫేర్ సెక్రటరీ తఫ్సీర్ ఇక్బాల్, ఎస్సీ వెల్ఫేర్ రెసిడెన్సియల్ స్కూల్స్ సెక్రటరీ అలుగు వర్షణి, బీసీ వెల్ఫేర్ రెసిడెన్సియల్ స్కూల్స్ సెక్రటరీ సైదులు, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ సర్వేశ్వర్ రెడ్డి కమిటీలో ఉన్నారు.