27-04-2025 12:00:00 AM
ఈత జోరు
బాల్యం ఎంత మధురమైందంటే.. బాల్యంలోకి తొంగి చూస్తేనే కాని అర్థం కాదు. వేసవి సెలవులు వచ్చాయంటే.. ఎంత వేడి ఉన్నా.. ఉదయం మాత్రం చాలా బాగుండేది. లేలేత సూర్యకిరణాలు ముఖం మీద పడుతుంటే కళ్లు నులుముకుంటూ నిద్రలేచేవాళ్లం. స్నానం చేయడానికి నేరుగా ఊరి చివర్లో ఉండే చెరువుల దగ్గరికి వెళ్లేవాళ్లం.
బాగా ఈత కొట్టేవాళ్లం. ఈత రానివాళ్లు అప్పుడే నేర్చుకునేవారు. కొందరు పొలాల్లో ఉండే బావుల్లో స్నానం చేసేవారు. గట్టుపై నుంచి బావిలో దూకడం చాలా సరదాగా అనిపించేది. స్నేహితులతో కలిసి ఈత కొడుతుంటే.. సమయమే తెలిసేది కాదు. అలా గెంతులు వేసిన ఆ రోజులు ఎంత బాగుండేవో కదా..!
ఐస్‌క్రీమ్.. ఐస్‌క్రీమ్
సాయంత్రం అవ్వగానే టన్.. టన్.. టన్ అంటూ గంట కొడుతూ మూడు పయ్యాల ఐస్‌క్రీమ్ బండి వచ్చేది. పింక్, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ రంగుల్లో ఉండే కోన్‌పై ఐస్‌క్రీమ్ పట్టిచ్చేవాడు. ఆ ఐస్‌క్రీమ్‌ను ఓ రేకు పెట్టెలో నుంచి ఓ చెంచాతో గీకి తీసి కోన్‌పై పేర్చేవాడు. ఇక ఐస్‌క్రీమ్ కు అసలైన టేస్టు, లుక్కు రంగుల్లోనే ఉండేది.
ఇక సైకిల్‌పై ఐస్‌లు అమ్ముతూ పాల ఐస్, సేమియా ఐస్, నారింజ ఐస్, మ్యాంగో ఐస్ ఇలా రకరకాలుండేవి. ఇవి రూపాయి, రెండు రూపాయలకే దొరికేవి. అలాగే గడ్డకట్టిన పెప్సీలను కూడా అమ్మేవారు. పెప్సీ ఐస్ తినేటప్పుడు ఫస్ట్ చాలా రుచిగా అనిపించినా.. చివరకు అందులో తీపంతా అయిపోయి చప్పగా మారడంతో సగం తిని పడేసేవాళ్లం.