calender_icon.png 14 April, 2025 | 5:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తీపి జ్ఞాపకాలు

13-04-2025 12:00:00 AM

ఈ ఆటలు గుర్తున్నాయా? 

చిన్ననాటి జ్ఞాపకాలు నిజంగా మధురం. అవి మనకు జ్ఞాపకం వచ్చినప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేం. బాల్యం అందరికీ ఒక వరం లాంటిది. ఏ కల్మషాలు లేని ప్రపంచం. పచ్చని పొలాల్లో పంపు సెట్ల దగ్గర ఆడుకునే వాళ్లం. స్నేహితులతో గాలి పటాలు ఎగరేసే వాళ్లం. సీతాకోకచిలుకలు పట్టుకోవాలని ప్రయత్నించేవాళ్లం.. తూనీగలను పట్టుకుని దానికి దారం కట్టేవాళ్లం. ఇప్పటి పిల్లలు మొబైల్‌లో టాకింగ్ టామ్ లు, క్యాండీ క్రష్‌లు, పబ్‌జీల పిచ్చిలో పడిపోయారు.

సీమచింతకాయలు కోశారా? 

చిన్నప్పుడు ఊరబెట్టిన ఉసిరికాయ, ఉప్పుకారం పెట్టిన మామిడికాయ, జామ కాయలు, చీమ చింతకాయలు, ఈత పళ్లు, తాటి తాండ్ర, ఆశ చాక్లెట్లు, నిమ్మ తొనలు, తేనుండలు, రస్నాప్యాకెట్లు, కొబ్బరుండలు, పప్పు ఉండలు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. తలుచుకుంటేనే నోరూరుతుంది కదా.. ముఖ్యంగా చిన్నప్పుడు సీమ చింతకాయల కోసం పడే కష్టాలు అంతా ఇంతా కాదు.

ఎందుకంటే చెట్టు కొమ్మలు అంతా ముళ్లమయం. అందుచేత ఈ చెట్టును ఎక్కడానికి వీలుండేది కాదు. చిలుకు సహాయంతో కాయలు కోసేది. సీమ చింతకాయలు కోయడం అనేది పెద్ద టాస్క్. ఒక్కటి చెట్టు నుంచి కిందపడ్డదా.. దానికోసం అందరం ఎగబడేది. ఇవన్నీ ప్రస్తుతం అందమైన జ్ఞాపకాలు.