calender_icon.png 22 February, 2025 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తీపి జ్ఞాపకాలు

16-02-2025 12:00:00 AM

ఆడేద్దామా.. అష్టాచెమ్మా

అష్టాచెమ్మా ఆటను అప్పట్లో చిన్నా, పెద్దా, ఆడా, మగా అనే తేడా లేకుండా సరదాగా ఆడేవారు. ఈ ఆటకు నాలుగు గవ్వలను ఉపయోగించేవారు. వీటిని పందెపు గవ్వలంటారు. అష్టాచెమ్మా పటం గీసి ఆట ఆడుతారు. ఈ ఆట సాధారణంగా ఇద్దరుకానీ, నలుగురుకానీ ఆడుతారు. నాలుగు రకాల గవ్వలు లేదా చిన్నసైజు రాళ్లతోనూ ఆడేవారు.

అప్పట్లో గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఆటను ఆసక్తిగా ఆడేవారు. అయితే ఈ ఆట పిల్లల్లో మేధాశక్తిని పెంచడం ఒక ప్రయోజనం అయితే, పెద్దవాళ్లలో మతిమరుపును కూడా తగ్గించేవి. ప్రస్తుతం టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో మొబైల్‌లో ఆటలాడుతూ ఇలాంటి సృజనాత్మకత ఆటలకు దూరమవుతున్నారు. 

దాహం తీర్చే చేదబావి

మన పూర్వీకులు మంచి నీటి కోసం నిర్మించిన గిలక బావితో దాహార్తిని తీర్చుకునేవారు. వీటిని గొట్టపు బావి, దిగుడు బావి, చేదబావి అని కూడా అంటారు. ఎంత ఎండాకాలమైనా స్వచ్ఛమైన చల్లని నీటినిచ్చేవి.

అందుకే అప్పట్లో ఆడోళ్లు చేదబావుల చుట్టూ చేరి మంచి నీటిని తోడేవారు. అలాగే మంచినీటి కోసం ఊరి చివరన ఉన్న బావుల కోసం ప్రత్యేకం గా నడిచి వెళ్లి బిందెల్లో తెచ్చుకునేవారు. అప్పట్లో చేతి పంపు లున్నా, చాలామంది మాత్రం చేదబావి నీటిని ఎక్కువగా తాగడానికి ఇష్టపడేవారు.