09-02-2025 12:00:00 AM
అప్పట్లో ఇదే ఫ్రిడ్జ్
పుర్రెకో బుద్ది.. జిహ్వాకో రుచి అన్నట్టుగా మన పెద్దలు ఎన్నో వస్తువులను, పరికరాలను రూపొందిం చుకున్నారు. అలాంటి గృహోపకరణాల వాటిలో ఫ్రిడ్జ్ ఒకటి. పాలు పెరుగు, అన్నం, పచ్చళ్ళు, నెయ్యి మొదలుగునవి వాటిని వీటిలో దాచేవారు. పిల్లులు, ఎలుకల నుంచి సురక్షితంగా ఉంచడానికి దీనిలో భద్రపరిచేవారు.
దీనిని ‘గూడు’, ‘అలమర’ అని పిలచేవారు. అయితే దీనిని ‘తనాబ్బి’ అని కూడా అంటారు. దానికి తలుపులు కూడా ఉండేవి. ఆకాలంలో ప్రతి ఇంటిలో ఎక్కువగా కనిపించేవి. ఆ తర్వాత కాలక్రామేణా కనుమరుగయ్యాయి.
దాగుడు మూతల దండాకోర్
ఆ రోజుల్లో పిల్లలు ఆడుకునే ఆటల్లో దాగుడుమూతలు ఒకటి. పిల్లలు ఒక దొంగను ఎంచుకుంటారు. ఆడించే వ్యక్తి ఆ దొంగను ముందు కూర్చోబెట్టుకొని కళ్ళు మూసి, ఒక చెయ్యి పట్టుకుని ఎదురుగా నిలబడ్డ పిల్లల్లో ఒకరి వంక చూపిస్తూ, ‘వీరీవీరీ గుమ్మడిపండు వీరి పేరేమి‘ అని అడుగుతారు. ఆ పేరుతోనే ఆ పిల్లాడు వెళ్లి దాక్కుంటాడు. ఆ తరువాత మరొక పిల్లవాడి పేరు అడుగుతారు.
ఇలా అందరి పేర్లూ అడిగి అందరినీ దాక్కోమంటారు. ఇలా పిల్లలంతా ఎక్కడో ఒకచోట దొంగకు కనబడకుండా దాక్కుంటారు. ఆ తరువాత ‘దాగుడు మూతల దండాకోర్! పిల్లీ వచ్చే ఎలుకా భద్రం, ఎక్కడి వాళ్ళక్కడే గప్‌చుప్ సాంబారు బుడ్డీ’ అని పాడుతూ వెతుకుతాడు. ముందుగా ఎవరు దొరికితే వాళ్ళు దొంగ అవుతారు. ఈ కొత్త దొంగతో ఆట మళ్ళీ మొదలవుతుంది.