బొంగరం.. అబ్బురం
నేటి పిల్లలకి ఆటలంటే క్యాండీక్రష్, టెంపుల్ రన్ లాంటి వీడియోగేమ్స్ మాత్రమే గుర్తుకొస్తాయి. ఈ ఆటలు ఒళ్లు కదలకుండా, అలసిపోకుండా ఇంట్లో హాయిగా ఉండేలా చేస్తాయి. కానీ ఆరోజుల్లో శారీరకంగా అలసిపోయే ఆటలెన్నో ఉన్నాయి. వాటిలో బొంగరాలాట ఒకటి. బొంగరానికి తాడు చుట్టేటప్పుడు, తాడు చుట్టిన బొంగరాన్ని నేలమీద వదిలేటప్పుడు నేర్పు ఉండాలి.
లేకపోతే బొంగరం తిరగదు. కింద మేకు పైనుంచి బొంగరం చివరి వరకు తాడు చుట్టి విసిరినప్పుడు ఎవరిది ఎక్కువసేపు తిరిగితే వాళ్ళు గెలిచినట్టు. ఆ రోజుల్లో ఈ ఆటను ఎక్కువగా ఆడేవారు. ప్రస్తుతం టెక్నాలజీ కారణంగా ఎన్నో రకాల వీడియో గేమ్స్ అందుబాటులోకి రావడంతో బొంగరాలాట లాంటివి కనుమరుగయ్యాయి.
తొక్కుడు బిళ్ల ఆడేద్దాం..
తొక్కుడు బిళ్ల అనగానే.. చిన్నప్పడు ఆడిన రోజులు గుర్తుకొస్తాయి. అయితే దీన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఆడే ఆటగా, ముఖ్యంగా పిల్లలు ఆడుకునేదిగా భావిస్తాం. కానీ ప్రపంచవ్యాప్తంగా దీనికి పాపులారిటీ ఉంది. అతి పురాతనమైన ఈ క్రీడ. రోమన్ల పాలనా కాలంలో బ్రిటన్‌లో ప్రారంభమైందని చెబుతారు. అయితే బ్రిటిష్ సామ్రాజ్యంలో సైనిక శిక్షణ కోసం సుమారు వంద అడుగుల పొడవుతో ఉండే కోర్టుల్లో ఈ ఆటను ఆడించేవారట.
ఆ తరవాత అనేక మార్పులకు లోనై... ఒక్కో ప్రాంతంలో ఒక్కో తీరున ఈ ఆటను ఆడేస్తున్నారు. పది అంకెలు వచ్చేలా నేలపై పెద్ద పెద్ద గడులతో నిలువు, అడ్డంగా బాక్సులతో కోర్టుని గీస్తారు. ఆడేవారు బయట నిలబడి కాయిన్ లేదా పెంకుని అందులో వేసి ఒంటికాలితో వెళ్లి తేవాలి. ఈ ఆట ఏకాగ్రతనూ, చేతికీ, మెదడుకీ మధ్య సమన్వయాన్ని పెంచుతుంది. మరింకెందుకాలస్యం.. మీరు కూడా తొక్కుడు బిళ్ల ఆడి.. ఆనాటి జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చుకోండి.