ఆరిపోని దీపం!
పాతకాలం వస్తువుల ప్రత్యేకతే వేరు. విభిన్నంగా, ఆశ్చర్యకరంగా ఉండేవి. ఆరోజుల్లో లాంతరు దీపం వాడకం ఎక్కువ. ప్రతి ఇంటిలో కచ్చితంగా దర్శనమిచ్చేది. ఎంత గాలి వచ్చినా ఆరిపోని కిరోసిన్ లాంతరు ఇది. బయటకు వెళ్లాలన్నా ఈ లాంతరు పట్టుకొని వెళ్లిపోయేవాళ్లు. చీకట్లో పురుగు, పుట్ర చూసుకొని నడవటానికి కూడా ఈ లాంతరును ఉపయోగించేవాళ్లు.
అయితే అప్పట్లో కొంతమంది బుడ్డీ దీపం ఉపయో గిస్తే.. మరికొంతమంది కిరోసిన్ లాంతర్‌ను వాడేవాళ్లు. కాలక్రమేణా టార్చిలైట్, విద్యుత్ లైట్లు వెలుగులోకి రావడంతో కిరోసిన్ లాంతర్ కనుమరుగైపోయింది. అయితే ఇప్పటికీ కరెంటు లేని తెలంగాణ మారు మూల గ్రామాల్లో కిరోసిన్ లాంతర్లు వాడుతుండటం విశేషం.
-పాట భద్రంగా..
ఆ రోజుల్లో పాటలు వినాలంటే చాలామందికి మొదటగా గుర్తుకువచ్చేది రేడియో మాత్రమే. కానీ రేడియో తర్వాత టేప్ రికార్డర్ల హవా ఎక్కువగా కొనసాగింది. ఇష్టమైన పాటలు వినాలన్నా.. సినిమా కథలు పూర్తిగా తెలుసుకోవాలన్నా టేప్ రికార్డర్లపైనే ఆధారపడేవాళ్లు. అయితే ఆరోజుల్లో టేప్ రికార్డర్‌కు ఎంత ప్రాధాన్యం ఉందో.. దాంట్లో ఒదిగిపోయే క్యాసెట్‌కు అంతకంటే ప్రాధాన్యం ఉండేది.
నచ్చిన పాటలు వినాలంటే క్యాసెట్ తప్పనిసరి. అయితే టేపు రికార్డులో చిక్కుకుపోయే క్యాసెట్ రీలును జాగ్రత్తగా తీసి చుట్టడం ఒక కళగా ఉండేది. ఏ మాత్రం తేడా వచ్చినా రీలు మడత పడినా అక్కడ ఉండే పాట చెడిపోయేది. ఆ తర్వాత ఐపాడ్స్, స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రావడంతో టేప్ రికార్డర్‌తో పాటు క్యాసెట్స్ కనుమరుగయ్యాయి.