బ్లాక్ అండ్ వైట్ టీవీని చూశారా?
టెక్నాలజీ అనే మాట వినిపించని రోజుల్లో ‘బ్లాక్ అండ్ వైట్’ టీవీ ఆనాటి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఓ డబ్బా మాదిరిగా ఉండే ఈ టీవీ ప్రసారాలను అందించి జనాలను అబ్బురపరిచింది. దూరదర్శన్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాలను ఇంటిల్లిపాది మొత్తం ఆసక్తిగా చూసేవారు.
కేబుల్ లేకుండా కేవలం యాంటీనా సాయంతో మాత్రమే పనిచేసేది. అయితే ఛానల్ ఒక్కటే అయినా ఆసక్తిగా వీక్షించేవాళ్లు. ఆ తర్వాత ప్రైవేట్ ఛానళ్లు రంగ ప్రవేశం చేయడంతో బ్లాక్ అండ్ వైట్ టీవీ అటకెక్కింది. డిష్‌తోపాటు స్మార్ట్ టీవీలు అందుబాటులోకి రావడంతో బ్లాక్ అండ్ వైట్ టీవీలు కనుమరుగయ్యాయి.
హలో.. కుశలమేనా!
ఆకాలంలో లాండ్ లైన్ ఫోన్ కలిగి ఉండటం చాలా గొప్పగా భావించేవారు. బంధువులకు, స్నేహితులకు ఫోన్ చేయాలన్నా చాలా ఖరీదైన వ్యవహారంగా ఉండేది. ధనవంతుల ఇళ్లలో, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండే ల్యాండ్ లైన్ సేవలు కొద్దిమందికి మాత్రమే అందుబాటులో ఉండేవి.
అయితే ఆ తర్వాత ఎస్టీడీ బూత్‌లు మార్కెట్లోకి రావడంతో ల్యాండ్ లైన్ ఫోన్లు చాలామందికి చేరువయ్యాయి. అయితే కాలచక్రం గిర్రున తిరగడం.. ప్రస్తుతం ప్రతిఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉండటం ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. ఏదేమైనా ఆరోజుల్లో “ట్రింగ్ ట్రింగ్’ అని మోగే ఫోన్ కోసం ఎంతోమంది ఎదురుచూసేవాళ్లు.